Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్.. అన్ని భాషల్లో తనే!
సచిన్ కొడుకు సచిన్ అవలేదు.. కానీ మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అయ్యాడని.. రీసెంట్గా హైపర్ ఆది ఇచ్చిన స్పీచ్ హైలెట్‌గా నిలిచింది. అయితే టాలీవుడ్ మెగాస్టారే కాదు.. మళయాళీ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఇండియాలో మొత్తం ఐదు భాషల్లో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, మళయళి, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలను విడుదల చేస్తున్నారు. అలాగే ఓటిటి వచ్చాక వెబ్ సిరీస్‌లు కూడా అన్ని భాషల్లో వస్తున్నాయి. ప్రజెంట్ స్టార్ హీరోలు కూడా ఓటిటి బాట పడుతున్నారు. అయితే ఎన్ని భాషల్లో రిలీజ్ అయితే అన్ని భాషల్లో హీరోలు తమ సొంత డబ్బింగ్ చెప్పాలంటే కష్టమే. చాలామంది హీరోలు మాతృ భాషలో డబ్బింగ్ చెప్పి చేతులు దులిపేసుకుంటారు.
కానీ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ మాత్రం అలా కాదు. అన్ని భాషల్లోను డబ్బింగ్ చెబుతున్నాడు. తెలుగులో మహానటి తర్వాత సీతారామం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దుల్కర్. త్వరలోనే కింగ్ ఆఫ్ కోతా అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వంటి వెబ్ సీరిస్‌లు తీసిన రాజ్ అండ్ డికె దర్శకత్వంలో ‘గన్స్ అండ్ గులాబ్స్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు.
70 దశకంలో జరిగిన సంఘటనల ఆధారంగా నలుగురు కుర్రాళ్ళ మధ్య క్రైమ్ కామెడీ డ్రామాగా దీన్ని రూపొందించారు. త్వరలోనే నెట్ ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్‌కు మళయాళి, తెలుగుతో పాటు మిగతా అన్నీ భాషల్లోనే తనే సొంతంగా డబ్బింగ్ చెప్పాడట దుల్కర్ సల్మాన్. దీంతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు దుల్కర్. ఆయన తండ్రి మమ్ముట్టి దళపతి, స్వాతి కిరణం, సూర్య పుత్రులు, యాత్ర సినిమాలకు తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు కొడుకు కూడా ఇదే బాటలో నడుస్తున్నాడని చెప్పాలి.