షారూక్ ఖాన్ సినిమాను బైకాట్ పఠాన్ అంటూ నెటిజన్లు ట్రెండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. సినిమాలోని బేషరమ్ రంగ్ పాటపై దేశవ్యాప్తంగా నిరసనలు, సోషల్ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తింది. సినిమాను నిషేదించాలని, పాటలో సీన్‌ను తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని పలు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. గతంలోను ఇతర నటుల సినిమాలకు బైకాట్ దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ బైకాట్ ట్రెండ్‌పై స్పందించారు. సినిమాల విషయంలో, అనవసర వివాదాల్లో తల దూర్చవద్దని కేడర్ కు దిశానిర్దేశం చేశారు.
ఈ అంశంపై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. మోడీ నాలుగేళ్ల క్రితం ఈ సూచన చేసి ఉంటే బాగుండేదని, ఇప్పటికే బాలీవుడ్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు. పరిస్థితులు ఇప్పటికే చేయిదాటాయని, ఎవరి మాట ఎవరూ వినే పరిస్థితుల్లో లేరన్నారు. మోడీ గతంలోనే చెప్పి ఉంటే ఫలితం ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం అల్ మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్ విడుదల సమయంలో పైవిధంగా మాట్లాడారు. తద్వారా కొన్నాళ్లుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమను చుట్టుముట్టిన పలు వివాదాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
అల్ మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ సినిమా నిర్మాత షారిక్ పటేల్ కూడా ఈ అంశంపై స్పందించారు. ప్రధాని మోడీ బాగా చెప్పారన్నారు. పరిశ్రమపై ఉన్న ప్రతికూలతను ఇది కాస్త అయినా తగ్గిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై తాను అనురాగ్ కశ్యప్‌తో ఏకీభవించలేనని, ఆయన చెప్పింది తప్పు అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా, పఠాన్ సినిమా వివాదం నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోను బాలీవుడ్ బైకాట్ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. జోక్యం చేసుకోవాలని సీఎం యోగిని కలిసింది బాలీవుడ్.