ఓ రోజు సాయంత్రం ఇంటి ముందు నిలబడి ఉన్నారు నాగేశ్వరరావుగారు. అదే మన అక్కినేని నాగేశ్వరరావుగారు. అదే టైంకి నాగార్జున మెట్లు దిగి, కారెక్కి వాయువేగ మనోవేగాలతో గేట్ క్రాష్ చేసి వెళ్ళిపోయారు. నాగార్జున కారులో అలా వెళ్ళడం చూస్తూ నాగేశ్వరరావుగారు ఓ మాట అన్నారు. ‘’ చూడండి, రాబోయే రోజల్లో ఈ దేశం గర్వించదగ్గ నటుడిగా, హీరోగా ఎదుగుతాడు నాగార్జున’’ అని అంటూ ఆ గేట్ వైపుకే చూస్తూ కాసేపు అలా ఉండిపోయారు. అప్పటికే గీతాంజలి వచ్చేసింది. శివ వచ్చింది. రెండు సినిమాలతో నాగార్జున కెరీర్ నల్లేరు మీద బండిలా పరిగెత్తింది. అప్పుడున్న కాంపిటేషన్‌లో నాగార్జున ఓ పత్యేకమైన స్టయిల్‌తో తనని తాను బాగా తీర్చిదిద్దుకున్నారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ రావడానికి, వచ్చిన ఫాలోయింగ్ నిలదొక్కుకోవడానికి నాగార్జున చాలా కృషి చేశారని చెప్పడానికి ఏం సందేహించనక్కర్లేదు.
ఎప్పుడో 1967లో వచ్చిన సుడిగుండాలు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా తెరకు పరిచయమైన నాగార్జున కెరీర్లో ఎన్నో మైల్ స్టోన్స్ అండ్ లాండ్ మార్క్స్. దానికి ఆయన ప్రయత్నమే ఎక్కువ అందులో. కొత్తదనం కోసం నాగార్జున పెట్టని ఎఫర్ట్ లేనే లేదు. కొంత విమర్శలు ఎదురైనా సరే తాను నమ్మిన దాని కోసం చాలా కఠినంగా నిలబడిపోయారు, గీతాంజలి సినిమా సైన్ చేసినప్పుడు ఆనోటా ఈనోటా అందులో క్యారెక్టర్ గురించి ఇక్కడా అక్కడా పాకిపాకి, అయ్యబాబోయ్ ఇదేం క్యారెక్టర్రా బాబూ అని అందరూ గొల్లుమన్నారు. రివ్యూలు కూడా నిరాశజనకంగానే వచ్చాయి. కానీ గీతాంజలి నాగార్జున కెరీర్‌నే కాదు, తెలుగు సినిమాకి ఓ కలికితురాయిని అందించిన చిత్రంగా రికార్డయింది. అలాగే శివ సినిమా ఒప్పుకున్నప్పుడు కూడా నాగార్జునకి అందరూ ఎదురుతిరిగారు. ఒక్క ఆయన అన్నయ్య వెంకట్‌గారు తప్పితే నాగార్జునని సమర్ధించినవాళ్ళే లేరు. ఈ విషయం రామ్‌గోపాల్ వర్మే ఎన్నో సార్లు ఇంటర్వ్యూల్లో చెప్పడమే అందుకు సాక్ష్యం. రాఘవేంద్రరావుగారు కథవిని ఇతనెవడో నక్సలైట్లా ఉన్నాడని కామెంట్ చేశారు. అయినా నాగార్జున తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి సినిమా కంప్లీట్ చేశారు. శివ ఒక్క తెలుగులోనే కాదు ఆలిండియా లెవెల్లోనే ఒక చరిత్ర. తిరుగులేని మలుపు. రామ్ గోపాల్ వర్మ దేశం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగిన ప్రయాణానికి నాగార్జునే ప్రధానమైన రూపకర్త.
అన్నపూర్ణలో చిరంజీవిగారి షూటింగ్ జరుగుతుండగా నాగేశ్వరరావుగారు నాగార్జునని పిలిచి, ఓ సారి వెళ్ళి అబ్జర్వ్ చేసి రమ్మని పంపించారు. చిరంజీవి డాన్సులు మువ్మెంట్స్ చూసి నాగార్జున ఆలోచనలో పడిపోయారుట. ఇలా నేను చేయగలనా అనే మీమాంస నాగార్జునని వెంటాడింది. ఈ విషయం నాగార్జునే సభాముఖంగా చెప్పారు. అందుకే ఆయన తొక్కిన తోవ పూర్తిగా విభిన్నంగా, విలక్షణంగా ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న అక్కినేని అభిమానుల గర్వం ఇనుమడింపచేసే విధంగానే ఆయన ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగారు.
1986లో విక్రమ్, కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ అనే మూడు చిత్రాలతో నాగార్జున జైత్రయాత్ర మొదలైంది. ఇది 2025వ సంవత్సరం. ఈ యేడాది 100వ చిత్రానికి యువసమ్రాట్ సిద్ధమవుతున్నారు. అంటే 40 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం. ఇంకా మందుకెళ్ళి 1967లో వచ్చిన సుడిగుండాలు కూడా లెక్కపెడితే ఆయన తెరపైకి వచ్చి 65 ఏళ్ళు అనమాట. ఒక సంప్రదాయాన్ని, ఒక వారసత్వాన్ని మోసుకొచ్చి యాక్టివ్ కెరీర్లో ఇన్నాళ్లు కొనసాగడం ఒక రకంగా ఛాలెంజ్ అయితే, మరొక రకంగా ఆయన ఎంజాయ్ చేసిన ఓ గొప్ప అనుభవం ఇన్నాళ్ళ ఈ నటజీవితం.
అన్నపూర్ణ స్టూడియోస్‌ని నిలబెట్టడానికి మాత్రమే కెరీర్లోకి అడుగుపెట్టిన నాగార్జున ఆ బాధ్యతను విజయవంతంగా నిర్వహించినట్టే. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఎవరు మళ్ళీ ఆ కిరీటాన్ని మోయగలరు అంటే ఎవరో తెలియని ప్రశ్న నుంచి వచ్చిన బుల్లెట్‌లాంటి సమాధానమే ఈ యువసామ్రాట్. ఇన్నాళ్ళ ఈ కెరీర్లో నాగార్జున వ్యక్తిగతంగా ఎదుర్కొన్న కెరీర్ ఛాలెంజ్‌లు ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఆయనకుండే సహజసిద్ధమైన భరించగలిగే శక్తి, తద్వారా మళ్ళీ తన బాటను తాను సజావుగా నిర్మించుకోగలిగే సహనం, ఓర్పు, నైపుణ్యం వంటి ప్లస్ పాయంట్లు నాగార్జునను ఇంతవరకూ హ్యాపీగా నడిపించాయి. కొత్తవాళ్ళకి ఆయన ఎంతో తెగువతో రెడ్ కార్పెట్ వేసి మరీ కెరీర్లోకి ఆహ్వానించారు. ఎందరికో గొప్పగొప్ప కెరీర్లను ప్రసాదించారు. ఆయనే లేకపోతే, కాకపోతే రామ్ గోపాల్ వర్మ అనే సంచలన దర్శకుడు తెరముఖం చూసి ఉండలేకపోయేవాడు. కృష్ణవంశీని కూడా దగ్గరుండి ప్రోత్సహించింది నాగార్జునే. కొత్త కథలను ఎత్తుకోవడం ఆయనకు ఆయనే సాటి అని ఎన్నోసార్లు నిరూపించిన గొప్పతనం నాగార్జునకి చిరునామా అని చెప్పడానికి సందేహించనక్కర్లేదు. అప్పుడెలాగైతే మణిరత్నం గీతాంజలి చిత్రానికి ముందడుగు వేశారో, ఇప్పుడు తన నూరవ చిత్రానికి తమిళ యువదర్శకుడు కార్తీక్ విషయంలో కూడా అంతే గ్రాండ్‌గా ఫ్రంట్ ఫుట్ వేసిన ప్రత్యేకత నాగార్జున ఇప్పుడు కూడా ప్రదర్శించగలిగారు. అంటే కెరీర్‌ని కెరీర్‌గానే తీసుకున్న ఎక్సలెంట్ ప్రొఫెషనల్ అని చెప్పడానికి ఇదొక్కటే నిదర్శనం.
ఎన్నిసార్లు తరచితరచి చూసినా నాగార్జున నటజీవితం పూలపాన్పులా కనిపించినా కూడా పెద్దాయన అడుగుజాడలలో నడుస్తూ, మళ్ళీ తనదైన మార్కును నిరూపించుకోవడమంటే అదంత సులభమైన విషయం కాదు. అది ఎందరో చేయలేని పని. అటు బాలకృష్ణ, ఇటు నాగార్జనే కనిపిస్తారు. అందునా నాగార్జున విషయంలో అది మరింత కఠినతరమైన ప్రక్రియే. నాగార్జున ఫక్తు కమర్షియల్ సినిమాలు చేశారు. సాఫ్ట్ అండ్ సెంటిమెంటల్ ఫిల్మ్స్ చేశారు. మరోవైపు విప్లవాత్మకంగా భక్తిరసచిత్రాలు చేశారు. అన్నీ కలగలిసి తనదైన కెరీర్‌కి తానే ఒక ఆర్కెటిక్గా రూపొందగలిగారు. అదీ నాగార్జున కెరీర్లో గొప్ప ఫ్లాష్.