మనం జీవితంలో ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. దీర్ఘ కాలం జీవించాలి. ఆర్థికంగా స్థిరంగా ఉండాలి. అనుకుంటాం. ఇలా మనం ఆనందంగా ఎక్కువ కాలం జీవించాలంటే తప్పకుండా ఐదు ఉదయపు అలవాట్లను(Morning Habits) మన రోజు వారీ పనుల్లో భాగం చేసుకోవాలని అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుని ఆచరించేందుకు ప్రయత్నిద్దాం.
ఉదయం(Morning) లేచిన తర్వాత మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ ఉండేలా ఓ మంచి బ్రేక్‌ఫాస్ట్‌ని సిద్ధం చేసుకుని తినాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానేయొద్దని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదయం కాజూ, బాదాం, పిస్తా, వాల్నట్స్, ఖర్జూరం లాంటి నట్స్‌తోపాటు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే అల్పాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు మన శరీరం శక్తివంతంగా ఉండి రోజు వారీ పనులను హుషారుగా చేయగలుగుతుంది. అలాగే ఉదయాన్నే ఓ కప్పు కాఫీ తాగడం వల్ల మనం ఆ రోజంతా రిలాక్సింగ్‌గా, ఆనందంగా ఉండొచ్చు. కాఫీ తాగడం వల్ల విసుగు, ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే రోజుకు ఒక కప్పుకు మించి దీన్ని తాగకూడదని గుర్తుంచుకోవాలి. కుదిరితే ఉదయాన్నే వ్యాయామాన్నీ మీ జీవనంలో భాగం చేసుకోండి.
ఇంటి నుంచి బయటలు దేరి సొసైటీలోకి వెళతాం కదా. అలా బయటకు వెళ్లిన తర్వాత మొదటిసారి మీరు కలుసుకున్న పరిచయస్థుడితో మీరు చాలా పాజిటివ్‌గా మంచి విషయాలను మాట్లాడేందుకు ప్రయత్నించండి. వారు మీ పొరుగింటి వారు కావొచ్చు. ఆఫీసులో మీ కొలీగ్ అయి ఉండొచ్చు. వారితో కొంత మంచి సంభాషణను చేయండి. దీని వల్ల ఆ పాజిటివ్ వైబ్స్ రోజంతా ఉంటాయి. అలాగే రోజులో ఎదురయ్యే చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కోండి. చల్లటి పిల్లగాలి వీస్తుందనో, సీతాకోక చిలుక రెక్కలను రెపరెప లాడిస్తూ అలా అలా ఎగురుతుందనో, చిన్న పిల్లాడు స్వచ్ఛంగా నవ్వుతున్నాడనో, మీ తోటలోని కొత్త మొక్క పూలు పూసిందనో.. ఇలా ప్రతి చిన్న విషయాన్నీ చెప్పలేనంత సంతోషంతో స్వీకరించండి. నమ్మండి మీ జీవితంలో అంతులేని ఆనందాలు.. రోజూ మిమ్మల్ని అబ్బురపరుస్తూనే ఉంటాయి. అలాగే మీ అత్యున్నత లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన ప్రణాళికల్ని సిద్ధం చేసుకుని ఆరోజంతా దానికి అనుగుణంగా పని చేయండి. అంతే.