Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మృతిపై మొదటిసారి స్పందించారు. అలెక్సీ నావెల్నీ(Alexei Navalny) గత నెలలో జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయమై తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం పుతిన్ మాట్లాడారు. గత కొన్నేళ్ల కాలంలో ఆయన నావవల్నీ పేరెత్తడం ఇదే ప్రధమం. నావల్నీ మృతికి కొన్ని రోజుల ముందుగా తాము ఖైదీల మార్పిడి కింద నావల్నీని పాశ్చాత్య దేశాలకు అప్పగించి అక్కడ జైళ్లలో ఉన్న రైష్యా వ్యక్తులను తమ దేశానికి తీసుకుని వద్దామని అనుకున్నట్లు తెలిపారు.
అంతా నమ్ముతారో లేదో గాని నావల్నీ(Navalny) ప్రస్తావన వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి మాటలు పూర్తి కాకుండానే తాను అందుకు ఒప్పుకున్నట్లు తెలిపానని అన్నారు. అయితే నావల్నీని తిరిగి రష్యాలోకి రావొద్దనే షరతు విధించానని తెలిపారు. కానీ అంతలోనే ఆయన చనిపోయారని అన్నారు. జరిగిందేదో జరిగింది. ఇది జీవితం అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా నుంచి విడుదల చేయాలనుకుంటున్నట్లు పుతిన్(Putin) సహచరులు సైతం గత నెలలో తెలిపారు. ఈ చర్చలు తుది దశలో ఉండగానే ఆయన మరణించారు. అయితే పుతిన్‌కి అది ఇష్టం లేకే ఈ కుట్రకు తెర తీశారని నావల్నీ మద్దతుదారులు ఆరోపించారు. వాస్తవానికి ఆయనను అప్పగించి జర్మనీ జైలు జీవితం గడుపుతున్న వాడిమ్ క్రాసికోవ్ని విడిపించుకోవాలనే యోచనలో పుతిన్ ప్రభుత్వం ఉందని వార్తలు వినిపించాయి.