Digital Detox : మనందరికీ కావాలి ‘డిజిటల్ డిటాక్స్’.. అసలేంటిది?
స్క్రీన్లకు దూరంగా కొన్ని రోజులు గడిపితే మనలో పేరుకున్న డిజిటల్ చెత్త అంతా వదిలి కాస్త మానసిక ప్రశాంతత వస్తుంది. అందుకే ఇప్పుడు డిజిటల్ డిటాక్స్ అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. ఏంటిది? దీని కోసం మనం ఏం చేయాలి?
Digital Detox: మనం రోజు వారీ జీవితంలో అనేక స్క్రీన్ల మధ్యలో కాలం గడుపుతున్నాం. టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు.. ఇలా ఏదో ఒక దాన్ని ఉపయోగిస్తూనే ఉంటున్నాం. రోజుల తరబడి వీటిని అదే పనిగా వాడుతూ ఉండటం వల్ల మన మానసిక, శారీరక ఆరోగ్యంపై(mental and physical health.) ఆ ప్రభావం చాలా ఉంటుంది. ఇవి ముఖ్యంగా మన నిద్ర అలవాట్లను ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఆరోగ్యం పాడవుతుంది. డైలాగ్స్ ఇన్ క్లినికల్ న్యూరో సైన్స్‌లో దీనికి సంబంధించి ఓ నివేదికను ప్రచురించారు. ఈ టెక్నాలజీలన్నీ మన ఆరోగ్యంపై ఎంతో దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయని అందులో పేర్కొన్నారు.
ఇలా ఎక్కువగా స్క్రీన్ల మధ్య కాలం గడిపేవారంతా తప్పనిసరిగా కొన్ని రోజులకు ఒకసారి ‘డిజిటల్ డిటాక్స్’(Digital Detox) చేసుకోవాలని ఆ నివేదిక పేర్కొంది. అందుకు మనం మొబైళ్లు, ల్యాప్టాపుల్లాంటి వాటికి దూరంగా ఉండాలి. డిజిటల్ సెలవుల కోసం సిగ్నల్సే రాని ప్రదేశాలకు వెకేషన్‌కు వెళ్లాలి. ఇలా చేయడం వల్ల అక్కడ నెట్లాంటిది పని చేయదు కాబట్టి మనం ఆటోమేటిగ్గా వాటికి దూరంగా ఉంటాం. చుట్టూ జరుగుతున్న విషయాలను పట్టించుకుంటాం. ప్రకృతిలో మమేకమవుతాం. ఇలా చేయడం వల్ల మనం డిజిటల్ వస్తువుల నుంచి దూరం అయి డిటాక్స్ అవుతామన్నమాట.
ఒక వేళ పూర్తిగా ఇలా సెలవులకు ఎక్కడికో వెళ్లకపోయినా ఇంట్లోనే ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నింటికీ కొంత సమయం పాటు దూరంగా ఉండండి. రాత్రి భోజనం చేసిన తర్వాత ఫోన్ ఆపేసి ఉదయం లేచిన తర్వాత స్విచ్ ఆన్ చేయండి. ఖాళీ సమయాల్లో స్క్రీన్ టైం గడపకుండా గార్డెనింగ్, హాబీల్లాంటి పనులు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వండి. బెడ్రూంని నో ఫోన్ జోన్‌గా పెట్టుకోండి. ఇలాంటి చేయడం వల్ల కొంతవరకు మనం డిజిటల్ వస్తువుల దుష్ప్రభావాలను తగ్గించుకున్న వాళ్లం అవుతాం.