Bus Fire Accident : టూరిస్టు బస్సులో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న ప్రయాణికుల్లో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘోర ప్రమాదం హరియాణాలో(Haryana) గత అర్ధ రాత్రి చోటు చేసుకుంది. బస్సులో ఉన్న మరో ఇరవై నాలుగు మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఫైరింజన్లతో మంటలను చివరికి అదుపులోకి తీసుకు వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బస్సులో 60 మంది వరకు టూరిస్టులు ప్రయాణిస్తున్నారు. వీరంతా మధుర, బృందావన్‌ను దర్శించేందుకు ఈ బస్సులో ప్రయాణం అయ్యారు. పర్యటన పూర్తయిన తర్వాత తిరిగి వస్తుండగా హరియాణాలోని నుహ్(Nuh) జిల్లా తావడు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. గాయపడిన 24 మందిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
బస్సును బయటి నుంచి చూసిన స్థానికులు కొన్ని వివరాలను వెల్లడించారు. అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో బస్సు వెనక భాగంలో మంటలు(fire) చెలరేగాయని చెప్పారు. డ్రైవర్ కూడా ఈ విషయాన్ని గుర్తించలేదని అన్నారు. ఆమంటలను చూసిన వారు బస్సు ఆపమంటూ కేకలు వేశామని అయినా డ్రైవర్‌కి వినపడలేదని తెలిపారు. దీంతో ఓ యువకుడు బైక్‌పై బస్సును ఛేజ్ చేసి ఈ విషయాన్ని తెలిపాడని చెప్పారు. తాము వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసినట్లు తెలిపారు.