Anti aging : వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే!
నలభైలు వచ్చేసరికే కొంత మందికి ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనిపించేస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే మనం కొన్ని యాంటీ ఏజింగ్ టిప్స్ పాటించాల్సిందే. అవేంటంటే..?
tips for anti aging : కొంత మందిని చూసినప్పుడు మనం ‘ఏంటి? మీరు ఎప్పుడు చూసినా ఇలానే ఉంటారా?’ అని అడుగుతుంటాం. ఎంత వయసు పెరుగుతున్నా వారిలో వృద్ధాప్య ఛాయలు అనేవి కనిపించవు. చక్కటి చర్మ సౌందర్యంతో ఎక్కడా ముడతలు లేకుండా ఉంటారు. అలాంటి వారు అసలు ఏం తింటారబ్బా? అని చాలా మందికి సందేహం వస్తూ ఉంటుంది. అలా వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఎప్పుడూ యవ్వనవంతుల్లా ఉండాలంటే కొన్ని యాంటీ ఏజింగ్(anti aging) చిట్కాల్ని పాటించాల్సిందే.
చర్మాన్ని శుభ్రం చేసుకోవడానికి చాలా గాఢంగా ఉండే సబ్బుల్లాంటి వాటిని ఉపయోగించకూడదు. గాఢత తక్కువగా ఉండే సోప్స్‌ని లేదా సహజమైన స్క్రబ్‌లను వాడటం ఉత్తమం. అలాగే పొడి చర్మం ఉన్న వారు తప్పకుండా రోజూ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అలా రాసుకోకుండా ఉంటే చర్మం పైన వచ్చే ముడతలు, గీతలు పెరిగి వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. తినే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని అరికడతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇంకా ఫెర్మెంటెడ్ ఆహారాల్ని తప్పక తీసుకోవాలి. పెరుగు, మజ్జిక, ఇడ్లీ, దోశ లాంటి వాటిని తినడం వల్ల మన శరీరంలో ప్రోబయోటిక్స్ పెరుగుతాయి. జీర్ణ శక్తిని పెంపొందిస్తాయి.
కొంత మంది మాట్లాడేప్పుడు అతిగా చర్మం(skin) ముడతలు పడేలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటారు. అలా నిత్యం చేస్తూ ఉండటం వల్ల నుదురు, బుగ్గల దగ్గర గీతలు పడతాయి. అలాంటి అలవాటును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా ఎవ్వరైనా సరే ఎండలో తిరగడానికి వెళుతున్నప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. లేకపోతే అతినీల లోహిత కిరణాల తాకిడికి చర్మం పాడవుతుంది. అలాగే ధూమపానం, మద్యం తాగడం లాంటి అలవాట్లు ఉంటే మానుకోవాలి.