»The Transformative Power Of Music In Mental Well Being
Mental Health : మానసిక సమస్యలా? సంగీతమే వైద్యం అంటున్న నిపుణులు!
ఒత్తిడి, ఆందోళన లాంటివి మనిషి జీవితంలోకి మానసిక సమస్యలను తీసుకొస్తున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు సంగీతం మంచి సాధనమని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయమై వారు ఏం చెబుతున్నారంటే?
Mental Health : ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి జీవితం ఉరుకుల పరుగులతోనే సాగిపోతోంది. బిజీ బిజీ జీవితాల్లో ఆందోళన, ఒత్తిడి లాంటివి మనిషి ఆరోగ్యాన్ని చిత్తు చేస్తున్నాయి. సమస్యలనేవి ప్రతి ఒక్కరికీ ఉంటాయి. వాటిని మనం ఎలా తీసుకుంటాం? అన్నదాన్ని బట్టే మన మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొందరు ప్రతి చిన్నదానికీ ఎక్కువగా గాభరా పడిపోతుంటారు. లేని పోని ఒత్తిడిని నెత్తిన పెట్టుకుంటారు. ఇలాంటి వారికి ఆందోళన, కుంగుబాటు లాంటి సమస్యలు వస్తుంటాయి.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్న వారికి సంగీతం(Music) మంచి వైద్యం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మంచి సంగీతాన్ని వింటూ ఉండటం వల్ల అది హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది. కార్టిసాల్ లాంటి హార్మోన్లు విడుదలై ఆందోళన తగ్గుముఖం పడుతుంది. మ్యూజిక్ మనకు స్ట్రెస్ బస్టర్లా పని చేస్తుంది. 2013లో ఈ విషయమై ఓ అధ్యయనం జరిగింది. దాని ఫలితాలు జర్నల్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీలో ప్రచురితం అయ్యాయి.
సంగీతం వింటున్నప్పుడు మనుషుల్లో ఒత్తిడి తగ్గుతోందట. ఒత్తిడితో కూడిన పనులను చేసేప్పుడు సంగీతం వింటూ చేయడం వల్ల మానసిక ప్రశాంతత మెరుగవుతోందట. నెదర్లాండ్స్‌లోని టిల్ బర్గ్ విశ్వవిద్యాలయం వారు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సంగీతాన్ని తరచుగా లీనమై వింటూ ఉండటం వల్ల ఆందోళన, డిప్రెషన్లు తగ్గుతాయి. మెదడు పని తీరు మెరుగై జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. డిప్రెషన్ లాంటివి తగ్గడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు సూథింగ్ మ్యూజిక్‌ని(Music) వినడం వల్ల ఆ సమస్య సైతం తగ్గుముఖం పడుతుంది.