»Video Shows Whale Landing On Boat Off Nh Coast Throwing People Into Ocean
Video : బోటుపై ఎగిరి పడిన తిమింగలం.. వీడియో వైరల్
ఓ చిన్న బోటుపై భారీ తిమింగలం ఎగిరి దూకే ప్రయత్నం చేసింది. దాని తాకిడికి ఆ బోటు నడి సముద్రంలో అల్లకల్లోలం అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది.
whale landing on boat : భారీ తిమింగలం చిన్న బోటు మీదికి ఎగిరి దూకే ప్రయత్నం చేసింది. దీంతో నడి సముద్రంలో ఉన్న ఆ బోటు ఓ సారి సముద్రంలోకి మునక వేసి మళ్లీ పైకి లేచింది. ఈ ఘటన అమెరికాలోని న్యూహాంప్‌షైర్ హార్బర్ సమీపంలో చోటు చేసుకుంది. 23 అడుగు పొడవున్న ఓ బోటు సముద్రంలోకి వేటకు వెళ్లింది. దానిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సముద్రంలోకి వెళ్లాక వారి బోటుకు దగ్గరగా ఓ భారీ తిమింగలం(Whale) కదలాడుతూ కనిపించింది.
దీంతో బోటులో ఉన్న వారు భయపడ్డారు. ఆ బోటును సమీపంలో ఉన్న మరో బోటు నుంచి వ్యాటీ యగీర్, కొలిన్ అనే ఇద్దరు వ్యక్తులు వీడియో తీస్తూ ఉన్నారు. సముద్రంలో ఉన్న ఆ తిమింగలం(Whale) ఒక్కసారిగా గాల్లోకి లేచింది. ఎగిరి ఆ చిన్న బోటుపై పడింది. దీంతో నడి సంద్రంలో బోటు చిగురుటాకులా వణికిపోయింది. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు భయపడి ముందే సముద్రంలోకి దూకేశారు. మరొకరు సైతం సముద్రంలోకి పడిపోయారు.
చుట్టు పక్కలున్న బోట్ల వాళ్లు అక్కడికి చేరుకుని సముద్రంలో పడిపోయిన వ్యక్తుల్ని రక్షించారు. తిమింగలానికి(Whale) సైతం ఎలాంటి గాయాలు కాలేదని వారు చెబుతున్నారు. ఈ న్యూహంప్షైర్ కోస్ట్‌లో(NH coast) ఎక్కువా భారీ తిమింగలాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలా బోట్లను మాత్రం ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. ఈ విషయమై వారు ది సెంటర్ ఆఫ్ కోస్టల్ స్టడీస్ మెరైన్ యానిమల్కు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన వీడియో(Video) ఇప్పుడు ఆన్లైన్లో వైరల్‌గా మారింది. దానిపై మీరూ ఓ లుక్కేసేయండి.