Sleeping Tips : మంచి నిద్ర ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. నిద్ర తక్కువ అయ్యే కొద్దీ మనలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకనే ప్రతి ఒక్కరికీ కనీసం ఏడు గంటల నాణ్యమైన నిద్ర అవసరం. పడుకునే ముందు కొన్ని ద్రవ పదార్థాలను తాగడం వల్ల అవి మన నిద్ర(Sleep) నాణ్యతను మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందామా మరి?
పడుకునే ముందు చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది. చిన్న గ్లాసుడు గోరు వెచ్చని పాలు తాగడం వల్ల చక్కగా నిద్ర(Sleep) పడుతుంది. ఈ అలవాటు మన ఆరోగ్యాన్నీ మెరుగు పరుస్తుంది. ఇంకా పాలల్లో కాస్త పసుపు వేసుకుని తాగడం వల్ల మంచిది. అయితే పసుపు పాలు రాత్రిళ్లు కొంత మందికి వేడి చేసినట్లుగా అవుతాయి. అలా లేకపోతే ఎవ్వరైనా వీటిని తాగొచ్చు. ఇవి తాగడం వల్ల మనలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. కండరాలు దృఢంగా మారతాయి.
మంచిగా నిద్ర పట్టడానికి చామంతి పూల టీ మనకు ఎంతగానో సహకరిస్తుంది. అలాగే అశ్వగంధ టీ కూడానూ. ఇవి నిద్రలేమి నుంచి మనల్ని కాపాడతాయి. వీటిలో ఏదో ఒక దాన్ని క్రమం తప్పకుండా ఆరు వారాలపాటు తాగితే అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇంకా నిద్రకు ముందు బాదం పాలు(almond milk) తాగడం వల్లా నిద్ర(Sleep) నాణ్యత మెరుగవుతుంది. పది బాదం గింజల్ని ఆరుగంటలు నానబెట్టి వాటిని మిక్సీ చేయడం వల్ల వచ్చే పాలను తాగడం వల్ల అనేక పోషకాలు మనకు అందుతాయి. మరుచటి రోజు లేచిన వెంటనే శరీరానికి నీరసంగా అనిపించకుండా ఉంటుంది.