»Trump Wins Colorado Ballot Disqualification Case At Us Supreme Court
Donald Trump : డొనాల్ట్ ట్రంప్‌కు భారీ ఊరట.. అనర్హత కేసు గెలుపు
కొలరాడోలో జరిగే రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా స్థానిక కోర్టు గతేడాది డొనాల్డ్ ట్రంప్‌పై అనర్హత వేసింది. దీన్ని ఇప్పుడు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేస్తూ తీర్పిచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
Trump wins disqualification case : అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. 2021లో క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించారన్న కారణంగా కొలరాడో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండ ఆ రాష్ట్ర న్యాయ స్థానం ఆయనపై అనర్హత వేసింది. ఆ వేటును సోమవారం అమెరికా సర్వోన్నత న్యాయస్థానం ఎత్తి వేసింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేసే అధికారం రాష్ట్రాలకు ఉండదని సూచించింది. ఈ మేరకు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పిచ్చింది.
ఈ తీర్పుతో డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు చాలా పెద్ద ఊరట లభించినట్లైంది. ఆయనపై అనర్హత వేటు తొలగిపోయింది. దీంతో కొలరాడో, ఇల్లినోయిస్, మైన్ల్లో ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్గం సుగమం అయ్యింది. ఇప్పటికే ప్రైమరీ ఎన్నికల్లో నిక్కీ హేలీపై వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్న ట్రంప్ ఇక దూకుడు మరింత పెంచుతారని వార్తలు వెలువడుతున్నాయి.
ఈ కేసుకు సంబంధించిన పూర్వ విషయాలను పరిశీలిస్తే…. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. అప్పుడు బైడెన్‌ను అడ్డుకోవడానికి 2021 జనవరిలో రిపబ్లికన్ పార్టీ మద్ధతుదారులు యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడికి దిగారు. వారిని ట్రంప్ సమర్థించారని, ప్రోత్సహించారని, హింసను ప్రేరేపించారని అభియోగాలున్నాయి. దీంతో ఆయనపై అనర్హత వేటు(disqualification) వేస్తూ కొలరాడో కోర్టు తీర్పు వెలువరించింది. ఆ అనర్హతను ఇప్పపుడు సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేస్తూ తీర్పిచ్చింది.