గాజాస్ట్రిప్‌లో అదుపులోకి తీసుకున్న పాలస్తీనియన్లను బందీ చేశారు. వీళ్ల కళ్లకు గంతలు, చేతులు కట్టేసి లోదుస్తుల్లో వారిని ట్రక్కుల్లోకి తరలిస్తున్నారు. ఇలా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.
Israel: పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. గాజాస్ట్రిప్‌లో పాలస్తీనియన్లను అదుపులోకి తీసుకుంటున్నారు. బందీలుగా ఉన్నవాళ్ల కళ్లకు గంతలు కట్టి.. చేతులు కట్టేసి కేవలం లోదుస్తుల్లో వారిని ట్రక్కుల్లోకి తరలిస్తున్నారు. ఇలా చేసి ఫొటోలు తీయడం, వాటిని సోషల్ మీడియాల్లో పెట్టడంతో మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జబాలియా శరణార్థి శిబిరం సమయంలో ఇజ్రాయెల్ రక్షణ బలగాలు భారీ సంఖ్యలో పాలస్తీనియన్లను అదుపులోకి తీసుకున్నాయి. వీళ్లంతా హమాస్ మిలిటెంట్లని, లొంగిపోయారని తెలిపాయి. అయితే ఇందులో సాధారణ పాలస్తీనా పౌరులే ఎక్కువగా ఉన్నారని మానవ హక్కుల సంఘాలు తెలిపాయి.
వలస వెళ్తున్న వైద్యులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, వృద్ధులను ఇజ్రాయెల్ దళాలు ఏకపక్షంగా అరెస్ట్ చేసింది. ఓ మీడియా సంస్థకు చెందిన ప్రతినిధిని కూడా అరెస్ట్ చేశారని ఆ సంస్థ పేర్కొంది. వీరిని అరెస్ట్ చేశాక దుస్తులు తొలగించి.. గుర్తు తెలియని ప్రదేశానికి తరలిస్తోందని వెల్లడించింది. ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారి బందీలకు సంబంధించి చాలా ఫొటోలు చూశారంట. ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఎంతోమంది బందీలు చనిపోయారు. కొంతమందికి గాయాలు కూడా అయ్యాయని హమాస్ తెలిపింది.