టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాలను నిన్న పర్యటించారు. పంట నష్టపోయి రైతులు కష్టాల్లో ఉంటే సీఎం బాధ్యతరహితంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని జగన్పై మండిపడ్డారు.
Chandrababu: రాష్ట్రంలోని రైతులు మిచౌంగ్ తుపానుతో తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు వాపోయారు. రైతులు నష్టపోయి కష్టాల్లో ఉండే ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా రైతులను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా బాధ్యత లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పంట కాలువలు, డ్రెయిన్లలో పూడికలు తీయలేదు. రైతులకు ప్రభుత్వం గోనె సంచులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను పర్యటించిన చంద్రబాబు రైతులతో మాట్లాడి వాళ్లకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మీ సమస్యలు తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి న్యాయం చేయడానికే ఇక్కడికి వచ్చానని అన్నారు.
ఎకరాకు రూ.25 వేల కౌలుతోపాటు రూ.30 వేలు పెట్టుబడిగా పెట్టారు. 15 రోజుల్లో పంట చేతికి వస్తుందనగా తుపాను వచ్చింది. తుపాను ముందస్తు చర్యల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎక్కువశాతం పంట పొలాల్లోనే నీటిపాలైంది. కాలువలు, డ్రెయిన్లను నాలుగేళ్లుగా వదిలేశారు. పంట బీమా అమలు చేయలేదు. కానీ సీఎం.. నేను ఇచ్చాను.. రైతులు ఆనందంగా ఉన్నారని అంటున్నారు. మీరు ఆనందంగా ఉన్నారా? అలాగే అంటే నేను ఇక్కడి నుంచి ఇటే ఇంటికి వెళ్తానని చంద్రబాబు ప్రశ్నించారు.
ముఖ్యమంత్రికి బంగాళదుంపకు, ఉల్లిగడ్డకు కూడా తేడా తెలియదు. తప్పుడు పనులు చేయడం తప్ప ఏమీ తెలియదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తుపాను వల్ల నష్టపోయిన వాళ్లకు ఆర్థిక సాయం పెంచి ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వరికి హెక్టారుకు రూ. 30 వేలు, ఆక్వాకు రూ.50 వేలు, మరణించిన వారికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు సాయం అందించాలి. ఇల్లు కోల్పోతే రూ.లక్ష ఇచ్చి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.