చైనాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిమ్‌కి వెళ్లిన 10 మంది దుర్మరణం చెందారు. పాఠశాల జిమ్ పైకప్పు కూలిపోవడంతో పది మంది చనిపోయారు. ఈ దుర్ఘటనలో మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు చైనా అధికారులు సోమవారం మీడియాకు వెల్లడించారు. హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని క్వికిహార్‌లోని 34వ నంబర్ మిడిల్ స్కూల్లోని జిమ్ కుప్పకూలింది. సోమవారం ఉదయం 5:30 గంటలకు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. జిమ్ శిథిలాల్లో నుంచి 14 మందిని అధికారులు బయటకు తీశారు. ప్రమాద స్థలం నుంచి నలుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. క్షతగాత్రులకు చికిత్స చేస్తుండగా ఆరుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
జిమ్ పైకప్పు కూలిపోవడంతో ఈ దారుణం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ వర్కర్లు శిథిలాలను తొలగించి రక్షణ చర్యలు చేపట్టారు. 160 మంది అగ్నిమాపక సిబ్బంది, 39 ట్రక్కులతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, భారీ వర్షాల కారణంగానే జిమ్ పైకప్పు కూలినట్లు చైనా అధికారులు వెల్లడించారు. మరోవైపు జిమ్ నిర్మాణ సంస్థ యజమానిని చైనా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.