ఉరుకుల పరుగుల జీవితాలు, మారుతున్న జీవన విధానం, ఎక్కువగా బయటి ఆహారాలను తినడం, మద్యం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం లాంటి ఎన్నో కారణాల వల్ల ఈ మధ్య కాలంలో తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తున్నాయి. ఇప్పటి మనుషుల్లో వయసు 30లు, 40లు వచ్చే సరికే వారికి చర్మం ముడతలు పడటం, తెల్ల జుట్టు రావడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో వారు చిన్న వయసులోనే పెద్ద వారిలా కనిపిస్తున్నారు. అయితే యాంటీ ఏజింగ్(Anti Aging) గా పని చేసే కొన్ని ఆహార పదార్థాలను తరచుగా తింటూ ఉండటం వల్ల చిన్న వయసులోనే పెద్దవారిలో కనిపించకుండా ఉంటారు. ఆ ఆహారాలు(Foods) ఏమిటంటే…
చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చిలకడ దుంపలు ఉపకరిస్తాయి. చర్మంపై ముడతలు, గీతలు రాకుండా చేస్తాయి. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ చర్మాన్ని మెరుస్తూ ఉండేలా చేస్తుంది. అలాగే ఎర్ర క్యాప్సికంలో వృద్ధాప్య ఛాయల్ని తగ్గించే కెరోటనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పసుపు, ఎరుపు, నారింజ రంగుల్లో ఉండే కూరగాయల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా దీనిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కలిసి చర్మాన్ని సూర్యరశ్మి వల్ల వచ్చే దుష్రభావాల నుంచి రక్షిస్తాయి. కాలుష్యం, పర్యావరణంలో ఉండే విష పదార్థాల తాకిడి నుంచీ కాపాడతాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంపైన, లోపల వచ్చే వాపులను తగ్గిస్తుంది.
సాల్మన్, మెకరాల్, ట్యూనా లాంటి జిడ్డు ఉండే చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి చర్మం మృదువుగా, తేమగా, మెరిసిపోయేలా ఉండేలా చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ ఈ, జింకుల వల్ల మొటిమలు, మచ్చల్లాంటివీ తగ్గుతాయి. ఇంకా ముగ్గిన బొప్పాయి పండులో విటమిన్లు, మినరళ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, బీ, సీ, కే, ఈలు ఉంటాయి. అలాగే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌లు దొరుకుతాయి. ఇవి చర్మం సాగే లక్షణాన్ని పెంచుతాయి. అందువల్ల ముఖంపై గీతలు, ముడతలు పడటం లాంటి ఇబ్బందులు తొందరగా తలెత్తవు. దీనిలో పాపైన్అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రకృతిలో సహజంగా దొరికే యాంటీ ఇన్ల్ఫమేటరీ ఏజెంట్లలో గొప్పదని న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు. ఇన్ని ఔషధ లక్షణాలు ఈ పండులో ఉన్నాయి కాబట్టి దీన్ని తరచుగా తింటూ ఉండాలంటున్నారు. ఇది శరీరం మృత కణాలు రాల్చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. అందువల్ల కాంతివంతమైన మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.