ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడలో మొదలైన కాంతార హవా.. ఆ తర్వాత మెల్లగా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. అసలు ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్.. సాధించిన వసూళ్లను లెక్కలేసుకుంటే.. ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్ ఇదే. కెజియఫ్ 2, ఆర్ఆర్ఆర్ సినిమాలు భారీ వసూళ్లను రాబట్టినా.. లాభాల పరంగా కాంతారదే పై చేయి. దాదాపు 15 కోట్లుతో తీసిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా 406 కోట్లు వరకు వసూలు చేసింది. ఈ లెక్కన ఈ సినిమా దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి ఎంత మ్యాజిక్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కాంతార క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి అద్భుతమే చేశాడు. అందుకే కాంతార ఊహించని విజయాన్ని అందుకుంది. అయితే ఇంత పెద్ద విజయాన్ని అందించిన రిషబ్‌కు.. కేవలం నాలుగు కోట్లు మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తోంది. పైగా హోంబలే ఫిలింస్ రిషబ్‌కు గిప్ట్‌లు కూడా ఏమి ఇవ్వలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాంతో నిజంగానే రిషబ్‌కు అన్యాయం జరిగిందని అంటున్నారు నెటిజన్స్. అయితే ఈ కాంతార మొనగాడు మాత్రం బంపర్ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది. కాంతార సినిమాతో రిషబ్ శెట్టి మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో.. ఆయనతో సినిమాలు చేయడానికి మేకర్స్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో రిషబ్ శెట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 50 నుంచి 60 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారట. ఆ సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల వరకు ఉంటుదని టాక్. అయితే ఆ ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నాడనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.