Karnataka: లోక్సభ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో కర్ణాటకలో భారీగా నగదు, బంగారం సీజ్ చేశారు. బళ్లారి జిల్లాలోని ఓ వ్యాపారి ఇంట్లో సోదాలకు వెళ్లిన పోలీసుకు రూ.7.6 కోట్ల నగదు, బంగారం, వెండి ఆభరణాలు దొరికాయి. వీటిని పోలీసులు సీజ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు, నగలను హవాలా మార్గంలో తీసుకుని వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఆ వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి అందజేస్తామని, తర్వాత ఐటీ అధికారులు దీనిపై తదుపరి దర్యాప్తు చేపడతారని పోలీసులు తెలిపారు.