»In Ayodhya Temple The Priests Throat Was Cut And The Disciples Were On The Run
Ayodhya: అయోధ్య ఆలయంలో పూజారి గొంతు కోసి కిరాతకం..పరారీలో శిష్యులు!
అయోధ్య రామమందిరం ప్రాంతంలో పూజారి హత్య కలకలం రేపింది. హనుమాన్ ఆలయంలోని పూజారిని గొంతు కోసి హత్య చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పూజారి శిష్యులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు.
రామ జన్మభూమి అయిన అయోధ్య (Ayodhya)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రఖ్యాత హనుమాన్ గర్హి ఆలయంలోని (Hanuman Garhi Temple) పూజారిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ మేరకు సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ రాజ్ కరణ్ నయ్యర్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. స్థానిక హనుమాన్ గర్హి ఆలయంలో 44 ఏళ్ల రామ్ సహరే దాస్ (Ram Sahare Das) అనే పూజారి విధులు నిర్వహిస్తున్నారు. తన ఇద్దరు శిష్యులతో కలిసి ఆయన ఆలయానికి పక్కనే ఉన్న ఓ గదిలో నివశిస్తున్నారు.
హై సెక్యూరిటీ జోన్‌గా ఆ ప్రాంతంలో రామ్ సహరే (Ram Sahare Das) విగతజీవిగా కనిపించడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. రామ జన్మభూమిలో ఈ దారుణ ఘటన కలకలం రేపింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. పూజారిని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం ఉదయం ఈ దారుణ ఘటన జరిగిందని తెలిపారు. దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేశారని గుర్తించారు.
గత రాత్రి పూజారికి, ఆయన శిష్యులకు మధ్య తీవ్ర ఘర్షణలు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలియజేయడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఓ శిష్యుడు పట్టుబడగా మరో శిష్యుడు పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆ శిష్యుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రామ మందిర ప్రాంతంలో ఈ హత్య హైసెక్యూరిటీ జోన్ మధ్య జరగడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు.