Journalist Sowmya: ఢీల్లీలో 15ఏళ్ల క్రితం సంచలనం రేపిన ప్రముఖ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో 15ఏళ్ల తర్వాత ఢిల్లీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. మొత్తం అయిదుగురుని దోషులుగా తేల్చింది. నలుగురు నిందితులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మల్లిక్, అక్షయ్ కుమార్‌ను హత్య, దోపిడీ అభియోగాల కింద దోషులుగా నిర్ధారించారు. వారికి సాయం చేసినందుకు అజయ్ సేఠీని దోషిగా ప్రకటించింది. వీరికి అక్టోబర్ 26న శిక్ష ఖరారు చేయనుంది.
ఓ టీవీ ఛానల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న సౌమ్య విశ్వనాథన్ 15ఏళ్ల క్రితం దారుణ హత్యకు గురయ్యారు. 2008 సెప్టెంబరు 30న తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఆమె ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంది. వసంత్ విహార్ ప్రాంతంలో ఆమె కారును నిందితులు అడ్డగించి దోపిడీకి ప్రయత్నించారు. తర్వాత ఆమెపై కాల్పులు జరిపి పారిపోయారు. ఉదయానికి కారులో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీస్‌లకు సమాచారం అందించారు. మొదట ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించి ఉండొచ్చని పోలీస్‌లు అనుకున్నారు.
పోస్ట్‌మార్ట్ రిపోర్టులో ఆమె తలకు బుల్లెట్ గాయం అయ్యిందని తెలియడంతో హత్యగా నిర్ధారించారు. తర్వాత సీసీటీవీ ఫొటోలను పరిశీలించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీస్‌లు 2009లో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వాళ్లు జ్యూడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. దోపిడీ కోసమే సౌమ్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి ఈకేసుపై సుదీర్ఘ విచారణ జరిగింది. తాజాగా నిందితులను దోషులుగా తేల్చుతూ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది.