Visakapatnam: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద విషాదం చోటుచేసుకుంది. సరదాగా బీచ్‌కు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. హర్ష, రాజ్ కుమార్ అనే ఇద్దరు విద్యార్థులు ఎన్నారై కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు. ఇద్దరు ఉదయాన్నే సరదాగా బీచ్‌కు వెళ్లారు. సముద్రం లోపలికి వెళ్లకుండా దగ్గరగానే ఈత కొడుతూ ఆడుకున్నారు. అలా ఈత కొట్టుకుంటూ ఇద్దరు విద్యార్ధులు గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఆ క్రమంలో గల్లంతైన విద్యార్థులల్లో హర్షని కొన ఊపిరితో బయటకు తీసుకువచ్చారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ హర్ష మరణించాడు.
ఇంకో విద్యార్థి రాజ్ కుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కానీ ఇంకా దొరకలేదు. సముద్ర తీరాన ఈత కొడుతున్న ఈ ఇద్దరు అకస్మాత్తుగా కెరటం రావడం వల్లే గల్లంతయ్య ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో బాధిత విద్యార్థుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.