Indian students : విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులు ప్రమాద వశాత్తూ మృతి చెందిన ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇదే క్రమంలో రష్యాలో నదిలో(river) పడి మునిగిపోయి నలుగురు భారతీయ విద్యార్థులు(Indian students) మృతి చెందారు. ఆ నలుగురి వయసు 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపే ఉంటుంది. ఇప్పటి వరకు రెండు మృత దేహాలను అక్కడి సహాయక బృందాలు వెలికి తీశాయి. మరో ఇద్దరి మృత దేహాలను గాలిస్తున్నారు.
ఈ ఘటన రష్యాలోని నోవ్‌గోరోడ్‌లో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఆ విద్యార్థులంతా వెలిక్ నోవ్గోరోడ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఐదుగురు కలిసి నది(river) దగ్గరకు విహార యాత్రకని వెళ్లారు. సరదాగా నదిలో దిగారు. వారిలో ఒకరు సురక్షితంగా బయట పడ్డారు. మిగిలిన నలుగురు నదిలో మునిగి చనిపోయారు. ఇంకా రెండు మృత దేహాలు లభ్యం కావాల్సి ఉంది.
ఈ భారతీయ విద్యార్థుల(Indian students) మృత దేహాలను స్వస్థలానికి తీసుకుని వచ్చేందుకు భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని కాన్సులేట్ అధికారులు, అక్కడి యూనివర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ సైతం స్పందించింది. మృత దేహాలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపింది. ప్రాణాలతో బయటపడిన విద్యార్థిని పేరు నిషా భూపేష్ సోనావానే అని పేర్కొంది. మిగిలిన వారు సైతం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన వారని తెలిపింది.