Indian Students: షాకింగ్..403 మంది భారతీయ విద్యార్థులు మృతి
విదేశాల్లో గత ఐదేళ్లలో భారతీయ విద్యార్థులు 403 మంది మరణించినట్లుగా విదేశాంగ శాఖ మంత్రి మురళీధరన్ వెల్లడించారు. భారతీయ విద్యార్థులను సంరక్షించే బాధ్యత తమదేనని, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని తెలిపారు.
గత ఐదేళ్ల కాలంలో విదేశాల్లోని భారతీయ విద్యార్థులు (Indian Students) 403 మంది మరణించినట్లు (403 died) కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2018 నుంచి ఇప్పటి వరకూ సహజ, ప్రమాదాలు (Accidents), వైద్య పరిస్థితుల (Health Issues) వల్ల 34 దేశాలలో 403 మంది భారతీయ విద్యార్థులు మరణించినట్లు ప్రకటించింది. ఇందులో అత్యధికంగా కెనడాలో 91 మంది విద్యార్థులు మృతిచెందినట్లు తెలిపింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ (Muralidharan) ఈ విషయంపై రాజ్యసభలో లిఖితపూర్వకంగా క్లారిటీ ఇచ్చారు.
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి తెలిపిన వివరాల మేరకు..కెనడాలో 2018 నుంచి 91 మంది, యునైడెట్ కింగ్డమ్ (UK)లో 48 మంది, రష్యా (Russia)లో 40 మంది, యునైటెడ్ స్టేట్స్ (US)లో 36 మంది, ఆస్ట్రేలియా (Australia)లో 35 మంది, ఉక్రెయిన్ (Ukrain)లో 21 మంది, జర్మనీలో 20 మంది, సైప్రస్‌లో 14 మంది, ఇటలీ, ఫిలిప్పీన్స్ లల్లో పదేసి మంది భారతీయ విద్యార్థులు మరణించారని ఆయన వెల్లడించారు.
విదేశాలలో ఉన్నటువంటి భారతీయ విద్యార్థుల (Indian Students) భద్రత తమ మొదటి ప్రాధాన్యత అని మురళీధరన్ (Muralidharan) తెలిపారు. అవాంఛనీయ సంఘటన ఏదైనా జరిగితే విచారణ జరిపి, నేరస్తులకు శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. ఇబ్బందుల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైనప్పుడు అత్యవసర వైద్య సంరక్షణ, బోర్డింగ్, లాడ్జింగ్‌తో సహా అన్ని సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు.