»Chhattisgarh Big Twist In Home Theatre Explosion Ex Lover Gifted To Groom
Home Theater పేలడంలో బిగ్ ట్విస్ట్.. బాంబు పెట్టింది ఆమె లవరే
గిఫ్ట్ లో పేలుడు పదార్థాలు ఉంచి తానే గిఫ్ట్ గా ఇచ్చినట్లు సర్జు అంగీకరించాడు. తనను కాదని వేరొకరిని వివాహం చేసుకుంటుందనే అక్కసుతో ఈ పనికి పాల్పడ్డానని సర్జు వివరించాడు.
పెళ్లికి వచ్చిన బహుమతుల్లో హోం థియేటర్ (Home Theater) పేలి వరుడు (groom), అతడి సోదరుడు మృతి చెందిన సంఘటన కీలక మలుపు తిరిగింది. హోం థియేటర్ లో బాంబు అమర్చింది వధువు మాజీ ప్రియుడు అని తెలిసింది. ఆమె పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఈ పని చేసినట్లు నిందితుడు చెప్పడంతో పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు. తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంపై ఆగ్రహంతో ఈ పని చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కబీర్ ధామ్ ఏసీపీ మనీషా ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం..
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) కబీర్ ధామ్ జిల్లాలోని చమారి గ్రామానికి చెందిన హేమేంద్ర మెరావి (22) ఈనెల 1వ తేదీన వివాహం చేసుకున్నాడు. అయితే అతడు చేసుకున్న యువతిని సర్జు (33) అనే వ్యక్తి గతంలో ప్రేమించాడు. అయితే అతడిని కాదని హేమేంద్రను వివాహం చేసుకోవడం సర్జుకు నచ్చలేదు. తన ప్రేయసిపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపాలని భావించాడు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన తన ప్రేయసి పెళ్లికి హాజరయ్యాడు. హాజరవడమే కాకుండా సర్జు హోమ్ థియేటర్ బహుమతిగా ఇచ్చాడు. పెళ్లి అనంతరం ఈనెల 2వ తేదీన వరుడితోపాటు కుటుంబసభ్యులు బహుమతులు తెరుస్తున్నారు. ఈ క్రమంలోనే సర్జు ఇచ్చిన హోమ్ థియేటర్ తెరిచారు. వెంటనే కనెక్షన్ ఇచ్చి స్విచ్ వేయగానే పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి వరుడు హేమేంద్రతోపాటు అతడి అన్నయ్య రాజ్ కుమార్ (30) చనిపోయాడు. కుటుంబసభ్యులు 5 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇల్లు కూడా ధ్వంసమైంది.
హోమ్ థియేటర్ పేలడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ గిఫ్ట్ ఇచ్చింది సర్జు అని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా గిఫ్ట్ లో పేలుడు పదార్థాలు ఉంచి తానే గిఫ్ట్ గా ఇచ్చినట్లు సర్జు అంగీకరించాడు. తనను కాదని వేరొకరిని వివాహం చేసుకుంటుందనే అక్కసుతో ఈ పనికి పాల్పడ్డానని సర్జు వివరించాడు. కాగా ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గొప్ప ప్రేమికుడివి రా బాబు అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రేమ దక్కకపోతే ప్రాణం తీస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.