NGKL: రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ హైదరాబాద్‌లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. నరేందర్ రెడ్డి లాంటి నిబద్ధత గల నాయకుడికి ఈ పదవి దక్కడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.
MBNR: దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం తాళ్లగడ్డ పెద్దవాగు వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం వేణు తెలిపారు. ఈ సంఘటనతో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్యలు మరోసారి స్పష్టమయ్యాయి.
SRCL: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెన్నమనేని వికాస్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు బుధవారం అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేశారు. మాజీ కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడైన వికాస్ రావు గత ఎన్నికలలో వేములవాడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, వేములవాడ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కిరణ్ రాజ్ తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, పిల్లల వైద్య నిపుణులు సహా పలువురు వైద్యులు పాల్గొంటారన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జగిత్యాల పట్టణంలోని టౌన్-3 సెక్షన్ పరిధిలో గురువారం ఉదయం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని జగిత్యాల డివిజనల్ ఇంజనీర్ కె. గంగారాం తెలిపారు. ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కారణంగా కారణంగా ఎస్పీ కార్యాలయం, వినాయక నగర్, రామాలయం, అంతర్గాం రోడ్ తదితర ప్రాంతాల్లో కరెంట్ ఉండదని అన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.
NLG: ఈనెల 14 నుంచి జరిగే టెన్త్ పరీక్షల కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు సెల్ నెంబర్ 9121213504 ను సంప్రదించవచ్చని డీఈవో బిక్షపతి తెలిపారు. అలాగే సందేహాల నివృత్తికి గురువారం ఉ. 10:30 నుంచి 11:30 వరకు ఫోన్ ఇన్ నిర్వహిస్తున్నట్లు, విద్యార్థులు 9121212513, 8498889294, 8309214196 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
MNCL: మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం రాత్రి రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. మృతుని వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండగా.. పడిగల రజనీ కాంత్, మల్కపల్లి గ్రామం అనే చిరునామా కలిగిన ఆధార్ కార్డు లభ్యమైంది. ముఖం నుజ్జు నుజ్జు కావడంతో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం ఉంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సంపత్ కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ ఆలయం ప్రాంగణంలో రేకులు షెడ్డు నిర్మాణానికి రూ. 11,115 దాతలు విరాళం ఇచ్చినట్లు ఆలయ ఛైర్మన్ మల్లయ్య నేడు తెలిపారు. హైదరాబాద్లోని బొరబండ ప్రాంతానికి చెందిన M రాజు అమ్మవారి ఆలయ అభివృద్ధికి సహకరించారని చెప్పారు. ఈ సందర్భంగా అర్చకులు దాతకు అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది ఉన్నారు.
KMM: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు 14 ఏళ్లు నిండిన బాలికలకు ప్రభుత్వం ఉచితంగా HPV వ్యాక్సిన్ అందిస్తోందని ఖమ్మం DMHO రామారావు తెలిపారు. ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ టీకా అందుబాటులో ఉందన్నారు. ప్రాణాంతక క్యాన్సర్ బారి నుంచి రక్షణ పొందేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
NRPT: మరికల్ మండలం రాకొండ ఊకచెట్టు వాగు వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపును బుధవారం రాత్రి పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సీఐ భగవంతు రెడ్డి, ఎస్సై రాము ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు మూడు హిటాచీలు, రెండు టిప్పర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.
HNK: ప్రజా పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ చావత్ బాజ్‌పాయ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అభివృద్ధి పనులు వేగవంతంగా అయ్యేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
GDWL: గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో మతసామరస్యం వెల్లివిరిసింది. సర్పంచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జామియా మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు సర్పంచ్‌ను శాలువాతో సన్మానించారు. కులమతాలకు అతీతంగా అందరూ సోదరభావంతో మెలగాలని వారు ఆకాంక్షించారు.
MDK: సింగూరు ప్రాజెక్టు భద్రత, మరమ్మతు పనులను రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూణే CWPRS రిటైర్డ్ ఛైర్మన్, నిపుణుడు విజయ్ త్రింబక్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఆనకట్టను సందర్శించింది. ఆనకట్ట రివిట్మెంట్ పనులను పూర్తి స్థాయి నాణ్యతతో చేపట్టాలని అధికారులకు సూచించారు.
PDPL: మంథని పట్టణంలోని కాకతీయ హై స్కూల్ విద్యార్థులు నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి తెలిపారు. NSOలో 200 మంది పాల్గొని 146 మంది రెండో స్థాయికి ఎంపిక కాగా 128 మంది గోల్డ్ మెడల్స్ సాధించారని చెప్పారు. IMOలో 248 మంది పాల్గొని 74 మంది విద్యార్థులు ప్రతిభ చూపారు.
సూర్యాపేట జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతపై హోటల్ యజమానుల సంఘం అత్యవసర సమావేశం మంగళవారం రాత్రి పట్టణంలో నిర్వహించారు. హోటల్ యజమానుల సంఘం జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్యాస్ లభ్యత లేక 200 హోటళ్లు మూతపడే దశకు చేరాయని, రూ.30 లక్షల మేడ నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.