NGKL: పదర మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో మహిళా సమాఖ్య భవనానికి మాజీ జడ్పీటీసీ, ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ అనురాధ శనివారం భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సంక్షేమం కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇవాళ నిర్వహించిన పదో తరగతి తెలుగు పరీక్షకు 11 మంది రెగ్యులర్ విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి కె.రాము తెలిపారు. 12,684 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా, 12,673 మంది (99.91%) హాజరైనట్లు వెల్లడించారు. సప్లిమెంటరీ విద్యార్థులు 12 మందికి 12 మంది (100%) హాజరైనట్లు తెలిపారు.
KNR: చొప్పదండి సింగిల్ విండో ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే సత్యం ప్రారంభించారు. రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని ఆయన అన్నారు. చొప్పదండి సహకార సంఘం ఆధ్వర్యంలో మార్కుఫెడ్ ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ క్వింటాకు రూ. 8000 చొప్పున కందులు కొనుగోలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
NGKL: నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న మహమూదా బేగం నిజాయితీపై ప్రశంసలు వస్తున్నాయి. నాగర్ కర్నూల్ వనపర్తి రూట్‌లో నడుస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు ఫోన్ మరిచిపోయి బస్సు దిగిపోయింది. ఈ విషయం గమనించిన కండక్టర్ ఫోన్‌ను బస్టాండ్ కంట్రోలర్ సురేష్‌కు అప్పగించారు. అనంతరం బాధితులకు సమాచారం అందించి ఫోన్ అందజేశారు.
MDK: చేగుంట మండలంలో గృహ అవసర గ్యాస్‌కు ఎటువంటి కొరత లేదని తహసీల్దార్ శివప్రసాద్ తెలిపారు. చేగుంట గ్యాస్ ఏజెన్సీ కేంద్రంలో ఇవాళ ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్ముందు అవసరాలకు కావలసిన గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గ్యాస్ విషయంలో ఎవరు భయబ్రాంతులకు గురికాకూడదని, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు.
SRD: కంగ్టిలోని లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 51వ వార్షికోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో మహాగణపతి పూజ, పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. గోపాల్ మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీ రామనామ భిక్ష కార్యక్రమం చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, గురువర్యుల ఆశీస్సులు పొందారు.
SDPT: నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈనెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. గతంలో ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల రూ.300కోట్ల నిధులతో పూర్తి చేశామన్నారు.
WGL: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ రేపు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రమాణస్వీకారం మహోత్సవానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
SRPT: గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. కేవైసీ అప్‌డేట్, సబ్సిడీ పేరుతో వచ్చే నకిలీ లింకులు క్లిక్ చేయవద్దని, తెలియని వ్యక్తులతో ఓటీపీలు పంచుకోవద్దని సూచించారు. బుకింగ్ కోసం అధికారిక యాప్‌లు మాత్రమే వాడాలన్నారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.
NZB: ‘ప్రజా పాలన- ప్రగతి పణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం ధర్పల్లిలోని నర్సరీని ఎంపీడీవో లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలం దృష్ట్యా మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందున మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించి, అవి ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
BHNG: యాదగిరిగుట్ట పట్టణం తోపుగని చెరువు గోదావరి జలాలతో నిండి అలుగు పోస్తున్న సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. ఆలేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువు నిండేలా చేసి ప్రజలకు, రైతులకు నీరు అందించడం తమ లక్ష్యమని తెలిపారు.
MLG: తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన ముకుందం (35) మద్యం మత్తులో తాడ్వాయి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. భార్య కాపురానికి రావడం లేదని మద్యం మత్తులో శుక్రవారం రాత్రి రోడ్డుపై గాయాలతో ఉండడంతో స్థానికులు గుర్తించి అతడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
WNP: బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ 92వ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఆత్మకూరులో మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీన హైదరాబాద్లోని బోరబండలో జయంతి వేడుకలు జరుగుతాయన్నారు. బహుజనులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
PDPL: కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’లో రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో ఆమె పాల్గొని మద్దతు తెలిపారు. హిందూ ఐక్యతకు ఇటువంటి యాత్రలు అవసరమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్, నరేశ్ పాల్గొన్నారు.
SRCL: చందుర్తి మండల కేంద్రంలోని ప్రాజెక్టును ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ ఇవాళ పరిశీలించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని చందుర్తి ప్రాజెక్టులోకి నీటిని తరలిస్తున్నారు. ఈ మేరకు రైతులతో ప్రభుత్వ విప్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తిమ్మాపూర్, రామన్నపేట, ఆశిరెడ్డిపల్లి గ్రామాల రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.