MDK: చిన్న శంకరంపేట మండలం టి. మాదాపూర్ తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాలోత్ ప్రసాద్, తిరుమల దంపతుల కుమార్తె చిన్నారి ప్రణయ శ్రీ (18 నెలలు) గురువారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటూ, అనుకోకుండా నీటి బకెట్‌లో తలకిందులుగా పడిపోయి మృతి చెందింది. కుటుంబ సభ్యులు గమనించేలోపే ప్రమాదం జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది.
NRPT : నారాచణపేట మండలం బసిరెడ్డిపల్లిలో హత్యకు గురైన చిన్నారి తేజశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేస్తూ PYL, POW ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఆర్థిక సహాయం అందించాలని గ్రామ రహదారిపై ఆందోళన చేశారు. సీఐ శివశంకర్ జోక్యం చేసుకుని, వారి డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వగా నిరసన విరమించారు.
JN: అనుమతి లేకుండా ఇసుక రవాణాకు సహకరించిన సర్పంచ్, ట్రాక్టర్ యజమానిపై గురువారం కేసు నమోదు చేశారు. దేవరుప్పుల మండలం చిన్నమడూరు వాగు నుంచి గత నెల 30న అనుమతులు లేకుండా ఇసుక తరలించినట్లు గుర్తించారు. ఈ విషయంపై తహసీల్దార్ అష్ఫాక్ అహ్మాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సృజన్ కుమార్ తెలిపారు.
JGL: భారత ప్రభుత్వం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అందించే ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పరిశ్రమలు, వాణిజ శాఖ జనరల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. 18-25 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, 10వ తరగతి, 12వ తరగతి, ఐటిఐ/ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలన్నారు.
BHNG: ఆత్మకూర్ మండలం రాయపల్లిలో అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం సీసీ రోడ్డు పనులను ప్రారంభించి, నూతన ఇందిరమ్మ గృహప్రవేశ వేడుకలో లబ్ధిదారులకు పట్టువస్త్రాలు, యాట పొట్టేలు అందజేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధియే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
JGL: గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ గుండు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రూ.10 లక్షలతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. గంగాదేవిపల్లిలో రూ.20 లక్షల పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. మహిళల అభ్యర్థనపై గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.
ASF: సిర్పూర్ (టి) మండలంలో పోలీసులు గురువారం రాత్రి నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం, అక్రమంగా తరలిస్తున్న బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు మండల కేంద్రంలోని దుర్గ భవాని రైస్ మిల్లుపై పోలీసులు దాడి చేశారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 9 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు.
ADB: జిల్లాలో ఇసుక పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకం చేసేందుకు జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మన ఇసుక-వాహనం (MIV) పోర్టల్ ద్వారానే ఇసుక విక్రయాలు జరపనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వినియోగదారులు తమకు కావలసిన ఇసుకను tgmiv.cgg.gov.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చని రాజర్షి షా సూచించారు.
NLG: విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న పోరాటంలో భాగంగా గురువారం నల్లగొండ విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వారికి సంఘీ భావంగా ప్రకటిస్తూ ధర్నాలో పాల్గొన్నారు.
MDK: రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ హెచ్చరించారు. వెలుపుగొండ రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేయగా 36.32 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో డీలర్ దినకర్‌పై 6-ఏ నిబంధన కింద కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు.
RR: షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని మొత్తం 28 వార్డుల్లో అధికారులు ప్రణాళిక బద్ధంగా వార్డు సభలను నిర్వహించి సమస్యలపై ఆరా తీశారు. ఆరో వార్డులో నిర్వహించిన వార్డు సభలో మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి పాల్గొన్నారు. వార్డులో ఓపెన్ డ్రైనేజీ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, దోమల ముప్పును వివరించారు. ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.
SDPT: చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవంలో సీపీ రష్మీ పెరుమాళ్ పాల్గొన్నారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఆపదలో ‘డయల్ 100’ సేవలను వినియోగించుకోవాలని, ఆత్మరక్షణపై దృష్టి పెట్టి లక్ష్య సాధనకు కృషి చేయాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు.
KMM: పిండిప్రోలులో ఇవాళ గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహింస్తున్నారు. ఈ వేడుకల కోసం ఉపేందర్ అనే యువకుడు చర్చిలో పాటలు పెడుతుండగా అదే గ్రామానికి చెందిన కిశోర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి గురైన కిశోర్ రోలితో ఉపేందర్ తలపై బాదాడు. ఈ మేరకు ఉపేందర్‌ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ADB: జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11 గంటలకు మంచిర్యాల IDOCలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:15 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో CM పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు నిర్మల్ జిల్లా బాసర అమ్మవారిని దర్శించుకుంటారు. సీఎం పర్యటన స్థలాన్ని తనిఖీ చేస్తారు.
MNCL: పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కలిసి పనిచేయాలని MLA ప్రేమ్ సాగర్ రావు పిలుపునిచ్చారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన పార్టీ శ్రేణుల సమావేశంలో మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను యూత్ సభ్యులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.