WNP: ఆత్మకూరు పట్టణ శివారులో ఎస్సై జయన్న ఆధ్వర్యంలో ఆదివారం విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NLG: కట్టంగూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బెల్లి జనార్ధన్ (50) ఆదివారం సాయంత్రం కట్టంగూరులోని ఒక స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లారు. నీటిలో ఈత కొడుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
NZB: సాలూరకు చెందిన రైతు గంగారాం వ్యవసాయంలో వినూత్న పద్ధతులు, రైతు సమస్యలపై పోరాటం వల్ల పుడమిపుత్ర జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. 35 ఏళ్లుగా వరి, చెరుకు, కూరగాయలు, మామిడి, జామ పంటలు సాగు చేస్తున్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుంటారు. ఈనెల 26న హైదరాబాద్‌లో ఆయనకు అవార్డు ఇవ్వనున్నారు. జాతీయ పురస్కారానికి ఎంపిక చేసిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
JGL: ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి ఆదివారం మొత్తం రూ. 4,00,907 ఆదాయం లభించింది. టికెట్ల ద్వారా రూ. 2,12,109, ప్రసాదాల ద్వారా రూ. 1,44,940, అన్నదానం ద్వారా రూ. 43,858 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి ఆలయ ఆదాయం పెరిగిందని చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు.
NRML: ఉమ్మడి జిల్లాల్లో గ్రామీణులకు ఉపాధి హామీ పథకంలో కూలీల పని దినాలు రాష్ట్రంలో పలు జిల్లాల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్ 92%, ఆసిఫాబాద్ 91.8%, మంచిర్యాల 89.4%, నిర్మల్ 87.4% సాధనతో లిస్టులో ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే నాలుగు జిల్లాలు మరింత మెరుగ్గా ప్రదర్శించాయి.
MNCL: చెన్నూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ 40 ఏళ్ల క్రితం నిర్మాణమే నేటి సమస్యలకు కారణమైంది. అప్పటి అవసరాలకు సరిపోయిన ఈ ప్రాంగణం, ప్రస్తుతం పెరిగిన రూట్లు, వేలాది ప్రయాణికుల రద్దీకి తట్టుకోలేక ఇబ్బందులు కలిగిస్తోంది. సరైన సౌకర్యాలు లేక ప్రయాణికులు చెట్ల కింద, హోటళ్ల వద్ద వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. కొత్త బస్టాండ్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలోని దేవి నగర్లో నిర్వహిస్తున్న శ్రీ కాళికాదేవి జాతర మహోత్సవాల్లో భాగంగా కళాకారులు వేషనాగమ్మ జానపద కథపై ఆకట్టుకునే ఆటను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో నాగమ్మ పాత్రలో కళాకారిణి తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించగా, కథలోని తెలివితేటలు, నైతిక విలువలను హృద్యంగా ప్రతిబింబించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై కళాకారులను అభినందించారు.
KNR: గంగాధర మండలం మధురానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో రూ. 10 లక్షల EGS నిధులతో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ వేముల భాస్కర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తూము రాజు కుమార్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నిధులు అడగగానే కేటాయించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు సర్పంచ్ వేముల భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు.
SDPT: చేనేత ఐక్యవేదిక సిద్దిపేట జిల్లా సలహాదారులు, పద్మశాలి సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ గోనె మార్కండేయులుకు ఉగాది సేవా పురస్కారం లభించింది. తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి బాబు మోహన్, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీర మోహన్ చేతుల మీదుగా మార్కండేయులుకు అవార్డు అందజేశారు.
GDWL: కేటిదొడ్డి మండలం ఇర్కీచెడు గ్రామ జాతర సందర్భంగా సర్పంచ్ ఆంజనేయులు, ఉపసర్పంచ్ లక్ష్మయ్య స్థానిక ఎస్సైని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మల్లారెడ్డి, జింగలప్ప, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జాతర ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని వారు పోలీసులను కోరారు.
SRD: ప్రజాపాలనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేసి నర్మెట్ట ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని గుమ్మడిదల, కానుకుంట రైతు వేదికల్లో లైవ్‌లో రైతులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఆత్మ కమిటీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, తదితరులు, రైతులు పాల్గొన్నారు.
KNR: సైదాపూర్ మండలం జాగీర్పల్లిలో ఆదివారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తొంట రజినీకాంత్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువైద్యుడు విజేందర్ రావు మాట్లాడుతూ.. గ్రామంలోని మొత్తం 287 పశువులకు ముందస్తు వ్యాధి నివారణ టీకాలు విజయవంతంగా వేసినట్లు ఆయన తెలిపారు.
MBNR: మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో ఏబీవీపీ విభాగ సమితి సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రాంత ప్రముఖ్ మాసాడి బాబురావు ముఖ్య అతిథిగా హాజరై, గతేడాది కార్యకలాపాలను సమీక్షించారు. రాబోయే కాలంలో విద్యార్థి సమస్యలపై పోరాటాలు, చేపట్టబోయే కార్యక్రమాలపై కార్య కర్తలకు దిశానిర్దేశం చేశారు.
SDPT: విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం వర్గల్లోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి, భోజన వసతులను పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన కామన్ డైట్ మెనూ ప్రకారం సరుకులు పంపిణీ చేయాలని, విద్యార్థులకు సరిపడా భోజనం వడ్డించాలని ఆమె సూచించారు.
MDK: నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకువచ్చిన కారు, బైక్ ఒక గేదెను ఢీకొనడంతో ఆ గేదె అక్కడికక్కడే మృతి చెందింది. అదృష్టవశాత్తూ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.