BHNG: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యాధికారి డా. మనోహర్ ఆధ్వర్యంలో సోమవారం అడ్డగూడూరు కేజీబీవీ పాఠశాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జిల్లా రోగనిరోధక అధికారి డా. రామకృష్ణ, ఆర్‌బీఎస్‌కే డా. శ్రీకాంత్ సమన్వయంతో జరిగిన ఈ శిబిరంలో సుమారు 200 మంది విద్యార్థులకు స్పెషలిస్ట్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు.
HNK: విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో కష్టపడి చదవాలని ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్ అన్నారు. చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు బ్యాగ్స్, పండ్లు పంపిణీ చేశారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని లక్ష్యసాధనకై ఏకాగ్రతతో చదవాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవ, కంచరాజు కుమార్, రామకృష్ణ పాల్గొన్నారు.
BDK: ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.
WGL: ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నవీన్ స్వామి, మహిళా కన్వీనర్ మొగులోజు శారద డిమాండ్ చేశారు. సోమవారం పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌లో పర్యటించి 125 రోజుల పనిపై ప్రచారం చేస్తున్నప్పటికీ తగిన నిధులు కేటాయించడం లేదని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
MLG: ఏటూరునాగారం- తాడ్వాయి మండలాల మధ్య ఉరుములు, మెరుపులతో గాలి వాన బీభత్సం సృష్టించింది. రహదారులపై చెట్లు విరిగి పడటంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు నిలిచిపోగా, విషయం తెలుసుకున్న తాడ్వాయి ఎస్సై చేరుకుని జేసీపీ సహాయంతో చెట్లు తొలగించి మార్గం క్లియర్ చేశారు. ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులకు గురయినట్లు పేర్కొన్నారు.
HNK: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ పెసరు విజయచందర్ రెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవి శ్రీనివాసరావు, సభ్యులు కలిశారు. హనుమకొండ జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాల వివరాలను రాష్ట్ర గవర్నర్‌కు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.
హైదరాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌజ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులను మరో 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఉప్పర్పల్లి కోర్టు విచారణ జరిపింది. అయితే, తీర్పును ఎల్లుండికి వాయిదా వేసిన న్యాయస్థానం, ఆ రోజే ఇరుపక్షాల వాదనలను మరోసారి విననుంది.
MHBD: మరిపెడ మున్సిపాలిటీ మాకుల తండాలో బొడ్రాయి, బంగారు మైసమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతిష్ట వేడుకల్లో మాజీ గ్రంథాలయ ఛైర్మన్ నవీన్ రావు పాల్గొన్నారు. దేవతల అనుగ్రహంతో ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు.
KMM: సత్తుపల్లి మండలం ఎన్టీఆర్ కాలనీలో క్వారీలో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఆధార్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం మృతి చెందిన చిన్నారుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి వారి మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేశవ మాట్లాడుతూ.. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని ఆరోపించారు.
KMM: ఖమ్మంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఖమ్మం, వైరాలో అసంపూర్తిగా ఉన్న గిరిజన భవన్‌లకు నిధులు కేటాయించి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. గిరిజన విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఎంప్లాయిమెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
NRML: లక్షెట్టిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక ఐబీలో వారు సమావేశం నిర్వహించారు. 1972 నుంచి 2008 వరకు లక్షెట్టిపేట శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా ఉండేదన్నారు. ఆ నియోజకవర్గాన్ని మళ్లీ పునరుద్ధరించాలని వారు కోరారు.
VKB: ధారూర్ మండల పరిధిలోని నాగారంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సరైన వసతులు లేక చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్గొండ జిల్లా రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. సోమవారం మహా పూర్ణాహుతి, వసంతోత్సవం, చక్రస్నానం వంటి కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో పులకించిపోయింది.
ASF: జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడల పాఠశాలలో నిర్వహించిన ‘అశ్విత అథ్లెటిక్స్’ పోటీల బహుమతి ప్రధానోత్సవానికి జిల్లా కలెక్టర్ కే. హరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గెలుపొందిన క్రీడాకారులకు ఆయన బహుమతులు అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు.
BHPL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిని ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు.