SRPT: పెన్ పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సోమవారం హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానించిన కాపీని కలెక్టర్‌కు అందజేశారు. ఏప్రిల్ 1న అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ పోనుగోటి నరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
SRD: సిర్గాపూర్ మండలం పొట్పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పట్నం ఝరప్ప (58) సోమవారం పండరీపూర్ యాత్ర ముగించుకొని తుల్జాపూర్ భవాని మాతను దర్శించేందుకు క్యూ లైన్‌లో ఉండగానే ఛాతిలో నొప్పి రావడంతో అక్కడి సెక్యూరిటీ సహాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో గుండెపోటు రావడంతో రాత్రి మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు.
HYD: మార్కెట్‌లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. గత వారం మాంసం KG రూ. 300 నుంచి రూ. 325 మధ్య అమ్ముడుపోయింది. ఆదివారం నుంచి ధరలు తగ్గుతూ వచ్చాయి. HYDలో ఇవాళ విత్‌స్కిన్ KG రూ.220, స్కిన్‌లెస్ రూ. 251 చొప్పున ధర నిర్ణయించారు. ఇదిలా ఉంటే మార్జిన్ పెంచాలన్న డిమాండ్‌తో రేపటి నుంచి నగరంలో చికెన్ షాపుల బంద్‌కు వ్యాపారులు పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల్లో అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల వాతావరణం చల్లబడినప్పటికీ, రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల జొన్న, మొక్కజొన్న పంటలు నేలకొరిగే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం తమను నిలువునా ముంచుతోందని రైతులు దిగులు చెందుతున్నారు.
MDCL: జిల్లాలో కరెంట్ పొయ్యితో వంటలు వండుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని AE నరేష్ తెలిపారు. నీళ్లు పొయ్యిపై పడకుండా జాగ్రత్త పడాలని, ఇండక్షన్ స్టౌవ్‌కు సరిపోయే పాత్రలనే ఉపయోగించాలన్నారు. వైర్లు, ప్లగ్‌లు సరిగా ఉన్నాయో పరిశీలించాలని, వంట పూర్తయ్యాక స్విచ్ ఆఫ్ చేయడం తప్పనిసరని, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుందన్నారు.
BDK: అశ్వాపురం మండలంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నం చేశారు. సోమవారం ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో మండలంలోని గొల్లగూడెం వద్ద వాహనలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా భద్రాచలం నుంచి మణుగూరు వైపు వెళ్తున్న కారులో గంజాయి తరలిస్తూ పట్టుబడినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.
SRD: రైతులకు ధర నిర్ణయించకుండా భూమిని సర్వే చేసి భూసేకరణ చేయడం అన్యాయమని మునిదేవునిపల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ ప్రావీణ్య, ఆర్డీవో రాజేందర్‌కు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. పరిశ్రమల పేరుతో భూములను తీసుకుంటే తాము జీవనాధారాన్ని కోల్పోతామన్నారు.
NLG: నల్గొండ నగరంలో ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారులకు చెందిన 20 షాపులను సోమవారం మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సదరు యజమానులు పన్ను కట్టారు. కాగా, ఆస్తి పన్ను చెల్లింపునకు నేడే (మార్చి 31) ఆఖరు. గడువులోగా చెల్లించకుంటే అర్ధరాత్రి నుంచి ఆటోమెటిక్‌గా అపరాధ రుసుము పడుతుందని అధికారులు స్పష్టం చేశారు.
MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్న నాగారంలో ఓ విక్రయదారుడు ట్రాలీ ఆటోలో అంగన్వాడీ కోడిగుడ్లను విక్రయించడం వివాదాస్పదంగా మారింది. కోడిగుడ్లను రూ. 70లకే కేసు చొప్పున విక్రయిస్తున్నాడు. అయితే ఈ గుడ్లపై అంగన్వాడీ శాఖకు చెందిన స్టాంపు ఉండడంతో స్థానికులు గుర్తించి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ సిబ్బంది ఆటోను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
NRML: నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద సుందరీకరణ పనులు చేపట్టాలని మాదిగల అంబేద్కర్ సంఘ నాయకులు కోరారు. ఇందులో భాగంగా వారు మున్సిపల్ వైస్ ఛైర్మన్ గణేష్ చక్రవర్తికి నేడు వినతిపత్రం సమర్పించారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ గ్రీనరీ, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని విన్నవించారు. అదేవిధంగా విగ్రహం వద్ద వాహనాల నిలిపివేతకు చర్యలు తీసుకోవాలన్నారు.
KMR: BJP రాష్ట్ర నూతన కార్యవర్గంలో కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలకు పదవులు లభించాయి. రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు ప్రకటించిన జాబితాలో శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మాజీ MLA అరుణతార, మాజీ MP బీబీ పాటిల్ నియామకమయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పైడి ఎల్లారెడ్డికి చోటు దక్కింది.
HYD: ఆన్‌లైన్‌లో డబ్బు పంపుతున్నారా..? నగదు పంపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. చాటింగ్ సమయంలో బ్యాంకు ఖాతా వివరాలు, యూపీఐ సమాచారం, పేమెంట్ చేసిన రసీదులు, చాట్ మెసేజ్‌లు, ఫోన్ కాల్ వివరాలు అన్నింటినీ స్క్రీన్‌షాట్లు తీసుకుని భద్రపరచడం మంచిదని తెలిపారు. ఇలా చేస్తే మోసగాళ్లను గుర్తించడం సులభమవుతుందన్నారు.
NZB: ధర్పల్లి మండలం వాడి, మద్దుల తండా గ్రామాల్లో మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది. కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబెట్టారు. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ధాన్యం కొట్టుకుపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
JGL: కొండగట్టు అంజన్న ఆలయంలో ఏప్రిల్ 1-3 వరకు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 రోజులు కేవలం కేశఖండన, మాల విరమణ, ప్రత్యేక దర్శన సేవలు మాత్రమే కొనసాగుతాయని తెలిపారు. తిరిగి ఏప్రిల్ 4 నుండి ఆర్జిత సేవలు యథావిధిగా ప్రారంభమవుతాయన్నారు.
VKB: కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి నేతృత్వంలో కొడంగల్ రైతులు అశ్వారావుపేటలోని ఆయిల్ పామ్ తోటలను సందర్శించారు. టీజీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవ రెడ్డి రైతులకు సాగు విధానం, దిగుబడి, ఆర్థిక ప్రయోజనాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఆయిల్ పామ్ సాగుతో కలిగే లాభాలను వివరించారు. వ్యవసాయ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.