BHPL: CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్లను పోలీసులు తక్కువ సమయంలోనే రికవరీ చేసి బాధితులకు అందజేశారు. బొడ్డు మహేష్, సమ్మయ్య అనే ఇద్దరు వ్యక్తులు తమ ఫోన్లు పోగొట్టుకోగా BHPLసీఐ నరేష్ ఆధ్వర్యంలో వాటిని గుర్తించి ఇవాళ అప్పగించారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే www.ceir.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సీఐ సూచించారు.
JN: కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇవాళ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయన స్వయంగా స్వీకరించారు. ప్రజా సమస్యలకు అధికారులు ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి 207 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
MLG: స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని యువత అన్ని రంగాల్లో ఎదగాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ అన్నారు. సోమవారం ములుగు పట్టణంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఎ, డీవైఎఫ్ఎ, సీఐటీయూ సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు రక్తదానం చేయగా ఛైర్‌పర్సన్ వారిని అభినందించారు.
KMR: బ్యాన్స్ వాడ పట్టణంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క సిలిండర్‌ను రూ. 2,500కి విక్రయిస్తూ, వినియోగదారులను మోసం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కొంత మంది గ్యాస్ సిలిండర్ల సీల్స్‌ను అక్రమంగా తొలగించి, గ్యాస్‌ను ఇతర ఖాళీ సిలిండర్లలో సగం మేర నింపి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
MLG: ములుగు మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయినప్పటికీ తమకు ఇప్పటికీ గ్రామపంచాయతీ స్థాయి జీతాలే వస్తున్నాయని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం వేతనాలు పెంచాలని కోరుతూ సోమవారం కమిషనర్ రమేష్‌కు మెమోరాండం సమర్పించారు. పెంపు గురించి అడిగితే నిధుల లేమి కారణంగా అధికారులు స్పందించట్లేదని తెలిపారు.
ASF: ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్‌ను DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా, పోడు భూములకు పట్టాలు, గిరిజన గూడలకు రహదారులు కల్పించాలని విన్నవించారు. ఈ మేరకు నీరజ్ కుమార్ సానుకూలంగా స్పందించినట్లు సుగుణ పేర్కొన్నారు.
KNR: అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 27వ తేదీన సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పరిశీలించారు.
ADB: బాధితులకు అండగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ సోమవారం తెలియజేశారు. పట్టణంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో పాల్గొని అర్జీలను స్వీకరించారు. నలుమూలల నుండి వచ్చిన 28 మంది ఫిర్యాదుదారులు ఎస్పీకి నేరుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని SP ఆదేశించారు.
MHBD: చిన్నగూడూరు మండల కేంద్రంలో ఆకేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఇసుకను ఈనెల 24న వేలం వేయనున్నట్లు సోమవారం తహసీల్దార్ ప్రశాంత్ తెలిపారు. ఎస్సైప్రవీణ్ కుమార్ స్వాధీనం చేసుకున్న 13 ట్రాక్టర్ల ఇసుకను పోలీస్ స్టేషన్ ఆవరణలో డంప్ చేసినట్లు చెప్పారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
NZB: వేల్పూర్ మండలం లక్కోర గ్రామ పంచాయతీ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ కార్య క్రమం జరిగింది. గ్రామానికి చెందిన లబ్ధిదారు విజయకు సర్పంచ్ దాసరి అపర్ణ రాజేశ్వర్, ఉప సర్పంచ్ ఆడవల ఆత్మరాం చేతుల మీదుగా ఈ చెక్కును అందజేశారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఈ సాయం ఎంతో ఊరటనిస్తుందని నాయకులు పేర్కొన్నారు.
WNP: వేసవి దృష్ట్యా జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ శ్రీ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గతంలో ఇబ్బందులున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, పైపులైన్ల మరమ్మతులు ముందే పూర్తి చేయాలన్నారు. నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా పక్కా ప్రణాళికతో ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
SRPT: కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా అక్రమంగా పౌతి (సక్సెషన్) చేసిన మేళ్లచెర్వు నాయబ్ తహసీల్దార్ శ్రీధర్ నాయక్‌పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వేటు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆయనను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
PDPL: ధర్మారం మండలం కటికనపల్లిలో విద్యుత్ షాక్‌తో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. బొజ్జ అభిరాం (6) అనే బాలుడు తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి అన్నం తిని, పక్కనగల బల్ల కుమార్ ఇంటి వద్ద ఆడుకుంటుండగా చేతికి ఎర్త్ వైర్ తగిలి ప్రమాదవశాత్తు మరణించాడు. తండ్రి సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
NLG: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా ను జయప్రదం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం మునుగోడులో చేనేత కార్మికులతో కలిసి ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. చేనేత కార్మికులకు రూ. 5 లక్షల ఆరోగ్య భీమా సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
BHPL: సింగరేణి ఆర్జీ-1, 2, 3, భూపాలపల్లి ఏరియాలో NCWA ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్ల ప్రక్రియ మొదలైంది. సుమారు 15,300 మంది ఉద్యోగులకు మార్చి 2026 ఇంక్రిమెంట్లను ఆడిట్ విభాగం నమోదు చేస్తోంది. ఫైనాన్స్ మేనేజర్ మోహన్ రావు పర్యవేక్షణలో అధికారులు, క్లరికల్ సిబ్బంది ఈ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు.