KMM: ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో యాసంగి రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎకరానికి రూ. 6 వేల చొప్పున తొలుత చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యతనిస్తూ నిధులు విడుదల కానున్నాయి. ఖమ్మం జిల్లాలో రూ. 3.58 లక్షల మంది రైతులకు రూ. 440.63 కోట్లు, కొత్తగూడెం జిల్లాలో రూ. 1.91 లక్షల మందికి రూ. 353.78 కోట్లు అందనున్నాయి.
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలో కరువు నివారణకు పంట పొలాలలో నీటి కుంటలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం 50 కోట్లు వెచ్చించనుంది. ఈ మూడు జిల్లాలలో మొత్తం 100 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయగా మొదటి విడతగా 50 కోట్లు మంజూరయ్యాయి. బోరు బావులలో నీటిమట్టం పెంచడం, 24 గంటలు పంట పొలాలకు నీరు అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
KMR: బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో గురువారం ఉగాది పర్వదిన సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయ పూజారి అభిషేక్ ఆచార్య పంచాంగ శ్రవణం భక్తులకు వినిపించారు. స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.
SRD: మనూరు మండలం బోరంచ శివారు మంజీరా నది తీరంలో వెలిసిన నల్ల పోచమ్మ ఆలయంలో బుధవారం తెలుగు ఉగాది పండుగను జరుపుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. అనంతరం షడ్రుచుల ఉగాది పచ్చడిని పోచమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పించారు. ఉగాది పచ్చడిని భక్తులకు వితరణ చేశారు. ఇందులో అర్చకులు సిద్దయ్య, సిబ్బంది శ్రీకాంత్ రెడ్డి, శేఖర్ ఉన్నారు.
ASF: ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని జిల్లా SP నితిక పంత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. పండుగ వేళ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు.
VKB: కుల్కచర్ల మండలానికి నేడు మిషన్ భగీరథ నీరు పంపిణీ లేదని అధికారులు వెల్లడించారు. నీటి పంపిణీలో సమస్య వచ్చిందని పేర్కొన్నారు. గ్రామాలలోని పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు తమ గ్రామాల బోర్ల ద్వారా ప్రజలకు నీరు అందించాలని చెప్పారు. పండగ రోజున ఏర్పడ్డ ఇబ్బందులను ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మిషన్ భగీరథ అధికారులు కోరారు.
NRPT: వేసవికాలం దృష్ట్యా మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ గ్రామంలో గురువారం ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ కలాల్ రాజేందర్ గౌడ్ గ్రామపంచాయతీ ఆవరణలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామస్థులు, వృద్ధుల దాహాన్ని తీర్చించేందుకు ఈ సేవను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
HYD: నగరం శ్రీరామ నవమి శోభాయాత్రకు ముస్తాబైంది. ఈ నెల 26, 27 తేదీల్లో నగరం కాషాయమయంగా మారనుంది. హౌసింగ్ బోర్డు, ధూల్‌పేట నుంచి కోటి వరకు సాగే ఈ భారీ ర్యాలీలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దేశంలోనే అతిపెద్ద శోభాయాత్రగా గుర్తింపు పొందిన ఈవేడుక కోసం పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. నగర గల్లీలన్నీ జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లానున్నాయి.
JGL: గొల్లపల్లి మండల కేంద్రంలో మూడు దశాబ్దాల తర్వాత చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. స్థానిక శ్రీ కల్యాణ రామచంద్రస్వామి ఆలయ నూతన కమిటీని గ్రామస్థులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 30 ఏళ్లుగా సాధ్యపడని ఈ ఐక్యత, ఇప్పుడు కార్యరూపం దాల్చడంతో గ్రామస్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆలయ కమిటీ అధ్యక్షుడిగా అనంతుల భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా గడ్డం గంగాధర్ ఎన్నికయ్యారు.
PDPL: రామగుండం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో మూడు రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్, జెన్కో నీటి సరఫరా బంద్ కావడంతో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కొండ ప్రాంతం కావడంతో బోరింగ్లు వేసే అవకాశం లేదని, అధికారులు వెంటనే స్పందించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరారు.
NLG: నకిరేకల్లో ఉగాది సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం క్యాంపు కార్యాలయంలో పంచాంగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. ఈ వేడుకల్లో స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న నెట్‌వర్క్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ ఖాతాల ద్వారా మూడు నెలల్లో రూ.31 కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇంకా మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు అనుమానంతో విచారణ కొనసాగుతోంది.
నిర్మల్ జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించనున్న ఉగాది ఉత్సవాలలో భాగంగా జబర్దస్త్ బృందం సునామీ సుధాకర్, వినోదిని రానున్నారు. పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాలులో కార్యక్రమం ఉంటుందని, జిల్లా ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. అనంతరం ఉగాది పచ్చడి వితరణ ఉంటుందని వారు తెలిపారు
MLG: ఏటూరునాగారం (M) ముళ్లకట్ట గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో లీకేజీ వల్ల తాగునీటి సరఫరా తీవ్రంగా ప్రభావితమవుతోంది. DYFI జిల్లా ఉపాధ్యక్షుడు లాజర్ మాట్లాడుతూ.. ఈ సమస్య వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే లీకేజీని రిపేర్ చేసి నీటి సరఫరా సాఫీగా చేయాలని డిమాండ్ చేశారు. త్వరగా పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
JGL: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ మీటర్లు ఇవ్వాలని కోరుతూ రాయికల్ పట్టణ వార్డు సభ్యులు భూస గంగ మల్లయ్య, అనుమల్ల రమ బుధవారం రాయికల్ విద్యుత్ ఏఈ నవీన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఇంటి నిర్మాణాలు పూర్తి కావస్తున్నందున, లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ స్తంభాలు వేసి కనెక్షన్లు ఇవ్వాలని కోరారు.