GDWL: గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతినెల ఐదవ తేదీలోగా జీతాలు చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ కోరారు. జీపీ కార్మికులతో కలిసి డీపీవో శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో 1100 మంది కార్మికులకు జీఓ 60 ప్రకారం నెలకు రూ.19 వేల వేతనం ఇవ్వాలని, అవసరమైన సామగ్రి అందించాలని కోరారు.
WNP: తాగునీటి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. వనపర్తి పట్టణంలోని రాజనగరం శివారిలో గురువారం అమృత్ పథకంలో భాగంగా జల బాండాగారాల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. రూ.71.71 కోట్లతో నాగవరంలో 5 లక్షలు, రాజనగరంలో 6 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులను నిర్మించనున్నట్లు ఆయన వివరించారు.
BHPL: చిట్యాల మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ విజయ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును గదుల వారీగా తిరుగుతూ స్వయంగా పర్యవేక్షించారు. విద్యార్థులకు కల్పించిన మౌలిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, తాగునీరు, విద్యుత్ సౌకర్యాల్లో లోటుపాట్లు ఉండకూడదని అధికారులను ఆదేశించారు.
NRPT: మాగనూరు మండలం అమ్మపల్లి గ్రామ శివారులో పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించి 10 ట్రాక్టర్ల అక్రమ ఇసుకను సీజ్ చేశారు. ఎస్సై అశోక్ బాబు అనుమతులు లేకుండా ఇసుక నిల్వ, రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా అధికారులు అక్రమ రవాణాపై నిరంతర నిఘా కొనసాగిస్తారని తెలిపారు.
భారత ఎన్నికల సంఘం(ECI)లో 10 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే ఆఖరి రోజు. డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు MS Excelలో ప్రావిణ్యం గలవారు BECIL సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషానికి 35 పదాల వేగం తప్పనిసరి కాగా స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సైట్: becil.com
బాపట్ల: చుండూరు మండలం ఆలపాడుకు చెందిన నాగేశ్వరరావు అపరాల నూర్పిడి యంత్రంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు చేయి తెగి తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు వెంటనే తెనాలి జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆర్థోపెడిక్ వైద్యుడు హనుమంతరావు బృందం శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు.
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని 44 హైవేపై బుధవారం అర్ధరాత్రి కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక వైపు నుంచి బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
KMR: తెలంగాణ వర్సిటీలో సౌత్ క్యాంపస్‌లో మంగళవారం అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీనియర్లు జూనియర్లపై దాడికి దిగడంతో ఓ విద్యార్థికి గాయమైంది. దీంతో ఆగ్రహించిన జూనియర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, వార్డెన్ అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ప్రకాశం: ఒంగోలు కూటమిలో కుంపటి రాజుకుంటుందా అనే సందేహం ప్రజల్లో మొదలైంది. YCP నుంచి బాలినేని జనసేనలోకి వెళ్లగా.. అప్పటి నుంచి ఆయనపై అవాకులు, చవాకులు పేలుతూనే ఉన్నాయి. MLA దామచర్ల కూటమిలో ఉండగా.. వాస్తవానికి వీరిద్దరు కూటమిలో ఉన్నా వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
PDPL: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ఉన్నత విద్య కొనసాగించాలని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. బుధవారం ఆయన పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026 -27 సంవత్సరం ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆధారిత కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
WGL: పట్టణంలో కార్పొరేషన్‌కు సంబంధించిన అన్ని బకాయిలను పూర్తిగా చెల్లించాల్సిందేనని నగర కమిషనర్ చావత్ బాజ్ పాయ్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కార్పొరేషన్‌కు పెండింగ్‌లో ఉన్న పన్నులు, ఇతర బకాయిల చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని పట్టణ ప్రజలను కోరారు.
SDPT: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా, ఎన్నికల హామీ మేరకు పింఛన్ల పెంపు అమలు కాకపోవడంపై లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ. 4,000, దివ్యాంగులకు రూ. 6,000 ఇస్తామని ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి జిల్లాలోని 4,69,575 మంది పింఛన్ దారులు ఈ పెంపు ఎప్పుడు అమలవుతుందని ఎదురుచూస్తున్నారు.
NRML: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని ప్రవాసి మిత్ర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల సూచించారు. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు గల్ఫ్ దేశాలకు వెళ్లకూడదని గురువారం ప్రకటనలు వారు కోరారు.
HYD: నగరంలో మరో రెండు చెరువులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. పాతబస్తీలోని బమృకున్-ఉద్-దౌలా, కూకట్‌పల్లిలోని నల్ల చెరువు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 6న బమృకున్-ఉద్-దౌలా చెరువును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. హైడ్రా మొదట విడత చేపట్టిన 6 చెరువుల్లో ఇప్పటికే అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట గతేడాది సెప్టెంబరు 28న ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు మార్కెటింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ శైలకుమారి తెలిపారు. చిలుకూరులోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో 17 నుంచి 3 నెలల పాటు రిటైల్ సేల్స్ అసిస్టెంట్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని, ఈనెల 16త తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.