AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్రంలో డిగ్రీ తర్వాత ఉన్నటువంటి ఉపాధి అవకాశాలపై గెస్ట్ లెక్చరర్ ఎన్ఎస్ కృష్ణ విద్యార్థులకు వివరించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ఫిజిక్స్ కోర్సు చదవడం ద్వారా అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వీలుంటే పీహెచ్‌డీ చేస్తే అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ తన యాప్‌లో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, IOS యూజర్లకు ఫేస్ లేదా ఫింగర్ ప్రింట్ వినియోగించి రూ.5 వేలు వరకు చెల్లింపులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు, యుటిలిటీ పేమెంట్స్, మర్చంట్ లావాదేవీలు, వ్యక్తులకు నగదు పంపించేంటప్పుడు ఈ బయోమెట్రిక్ సదుపాయం పనిచేస్తుందని క్రెడ్ వెల్లడించింది.
CTR: పాలసముద్రం మండలం మిద్ది నత్తం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బుధవారం నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకు పోయారు. వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే మండల పరిధిలో పలు సిసి రోడ్లను ప్రారంభించారు. స్వచ్ఛ రథం వాహనానికి ప్రారంభోత్సవం చేశారు.
టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి సింగపూర్‌లో విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నాడు. IPLతో కాస్త విరామం దొరకడంతో భార్య, పిల్లలతో కలిసి ఆయన సరదాగా గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. IPL ముగిసిన వెంటనే టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌తో స్వదేశంలో తలపడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది.
KRNL: కోడుమూరు మండలం కృష్ణాపురం గ్రామంలో రైతుల సమస్యకు బుధవారం తక్షణ పరిష్కారం లభించింది. మంగళమిట్ట రోడ్డులో నాలుగు వాగుల్లో నీరు నిల్వ ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని రైతులు, నాయకులు కేడీసీసీబీ ఛైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి దృష్టికి తీసుకెళ్లారు. వారు వెంటనే స్పందించి వాగుల్లో పైపులు ఏర్పాటు చేసి రోడ్డును సరిచేశారు.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 31 నుంచి అమెజాన్, యాపిల్ టీవీల్లో స్ట్రీమింగ్ కానుంది. జూన్ నాటికి హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.
JN: రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన వల్మీడి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 27న జరిగే శ్రీరామనవమి కళ్యాణ ఏర్పాట్లను DCP రాజమహేంద్ర నాయక్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు పార్కింగ్, తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో RDO వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
PPM: జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం పనికిరాదని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. మురుగునీరు ఎక్కడా నిలిచిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, తద్వారా దోమలు వ్యాప్తి చెందకుండా ఉంటాయని అన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు కాలువల్లో ప్లాస్టిక్ బాటిల్స్, వ్యర్ధాలు వేయకుండా చర్యలు చేపట్టాలన్నారు.
BDK: అదనపు కట్నం కోసం వివాహితను వేధిస్తున్న భర్త సహా నలుగురిపై ఇల్లెందు పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘబోయినగూడెం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ తన భార్య స్వప్నను అదనపు కట్నం తేవాలని వేధింపులకు గురిచేశాడు. అతడి తల్లిదండ్రులు తమ్ముడు కూడా తోడై ఇబ్బందులు పెట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలు, మరిదిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 4,554 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఔన్సు వెండి ధర 72 డాలర్లకు పైనే కొనసాగుతోంది.
AP: అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్ర కేబినెట్ తీర్మానానికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. CRDA-2014 తీర్మానాన్ని సవరించాలని రాష్ట్రానికి సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయనుంది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని గతంలో ఏపీ కోరింది.
MHBD: తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో అంగన్వాడీ కేంద్రం నిర్వహణకు, శాశ్వత అంగన్వాడీ భవన నిర్మాణానికి స్థల సేకరణ చేయించాలని 10వ వార్డు కౌన్సిలర్ ముద్దసాని సురేష్ కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం తొర్రూరు మున్సిపాలిటీలో కలెక్టర్ స్నేహ శబరీష్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. వీలైనంత త్వరగా స్థలం మంజూరు చేయాలన్నారు.
కడప: జిల్లా బద్వేలు వైసీపీ జడ్పీటీసీ చిన్న పోలిరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రూ.33 లక్షల గోల్‌మాల్ చేశాడని నమోదైన కేసులో 15 రోజుల రిమాండ్ అనంతరం బెయిల్ లభించింది. ఈ కేసు రాజకీయ ప్రేరితమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బెయిల్ మంజూరుతో చిన్న పోలిరెడ్డి అనుచరులు ఆనందం వ్యక్తం చేశారు.
ELR: ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద ఏలూరు ప్రధాన కాలువలో మంగళవారం రాత్రి ఓ యువకుడు కాలువలో దూకేసినట్లు స్థానికులు తెలిపారు. ఆ యువకుడు నాచుగుంట పంచాయితీ యర్రమళ్ళ గ్రామానికి చెందినట్లు వారు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది ఇవాళ ఆ యువకుడి కోసం కాలువలో గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు.
ATP: గుత్తి పట్టణ కేంద్రంలో రెవెన్యూ అధికారులు బుధవారం రెండు బృందాలుగా విడిపోయి హోటళ్లపై దాడులు, తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో 28 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినట్లు మండల తహశీల్దార్ పుణ్యవతి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లకు వాడే గ్యాస్ సిలిండర్లను హోటల్‌లకు వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ ప్రజలకు హెచ్చరించారు.