»Ys Vivekananda Reddy Daughter Sunitha Reddy Posters Viral In Praddatur
YS Viveka కుమార్తె సునీత పోస్టర్లు కలకలం.. TDPలో చేరుతుందని వెలసిన పోస్టర్లు
వైఎస్ వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రపూరితంగా ఈ పోస్టర్లు వేశారని తెలుస్తున్నది. అయితే ఈ పోస్టర్లు తాము వేయలేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ నాయకులే పోస్టర్లు ముద్రించి పరువు తీసేందుకు ఈ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ (AP)లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు ప్రకంపనలు రేపుతోంది. అధికార పార్టీని, సీఎం జగన్ (YS Jagan)ను ఈ కేసు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. తన తండ్రి హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతా రెడ్డి (Dr Sunitha Reddy) తీవ్రస్థాయిలో న్యాయ పోరాటం చేస్తోంది. అయితే ఆమె పోరాటాన్ని వైఎస్సార్ సీపీ తప్పుబడుతోంది. టీడీపీ, ప్రతిపక్షాలతో కలిసి ఆమె పోరాటం చేస్తుందని ఆరోపణలు చేస్తోంది. అయితే ఆ ఆరోపణలు వాస్తవమన్నట్టుగా సునీత పోస్టర్లు కలకలం రేపాయి. తెలుగుదేశం పార్టీలో సునీత చేరబోతున్నట్లు పోస్టర్లు (Posters) వెలిశాయి. ఆ పోస్టర్లు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఏపీలోని కడప జిల్లా (Kadapa District) ప్రొద్దుటూరులో మంగళవారం సునీత పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ‘రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న వైఎస్ సునీతకు స్వాగతం.. సుస్వాగతం’ అని పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లలో జై తెలుగుదేశం (Telugu Desam Party) అని రాసి ఉంది. దీంతో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి, చంద్రబాబు (Chandrababu Naidu), లోకేశ్, అచ్చెన్నాయుడు, కడప నాయకులు శ్రీనివాసులు రెడ్డి, బీటెక్ రవి (Btech Ravi) తదితరుల ఫొటోలతో కూడా పోస్టర్లు స్థానికంగా కలకలం రేపాయి. ఈ పోస్టర్లు అతికించింది ఎవరనేది తెలియలేదు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ పోస్టర్లు అతికి ఉంటారని చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం వైఎస్ వివేకా హత్య (YS Viveka Murder Case) కేసు తుది దశకు చేరడంతో ఆ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రపూరితంగా ఈ పోస్టర్లు వేశారని తెలుస్తున్నది. అయితే ఈ పోస్టర్లు తాము వేయలేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ (YSRCP) నాయకులే పోస్టర్లు ముద్రించి టీడీపీ (TDP) పరువు తీసేందుకు ఈ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి దారుణాలకు సీఎం జగన్ తెరలేపుతున్నారని మండిపడుతున్నారు.