విశాఖ నగరంలో కలకలం రేగింది. నీళ్ల డ్రమ్ములో మహిళ మృతదేహం లభ్యమైంది. శవం కుళ్లిన స్థితిలో ఉండటం గమనార్హం. మహిళ చనిపోయి చాలా రోజులు అయ్యి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నండూరి రమేష్ అనే వ్యక్తి ఎండాడలో వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు.. ఆయనకు వికలాంగుల కాలనీలో ఓ ఇల్లు ఉంది. రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన రుషి అనే వ్యక్తి రమేష్ దగ్గర పనికి చేరాడు. దీంతో రమేస్ రుషి కుటుంబం ఉండేందుకుకాలనీలోని తన ఇంటిని అద్దెకు ఇచ్చాడు. ఆ ఇంట్లో రుషితో పాటు అతడి భార్య, కూతురు ఉండేవాళ్లు.
రుషి భార్య గర్భవతి కావడంతో రెండు నెలల క్రితం పుట్టింటికి పంపించానని.. తానూ పని మానేస్తున్నానని రుషి యజమానికి చెప్పి ఇంటిని ఖాళీ చేశాడు. ఇంతలో ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే యజమాని రమేష్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన ఇంటి తాళం తీసి చూడగా నీళ్ల డ్రమ్ములో మహిళ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది.
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలిస్తున్నారు. చనిపోయి చాలా కాలం అయినట్లు అనుమానిస్తున్నారు. ఆ మృతదేహం ఎవరిది అనే విషయం ఇంకా తెలియరాలేదు. రిషి భార్యదే అని కొందరు అంటుంటే… మరెవరిదైనా అయ్యి ఉండవచ్చని మరికొందరు భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.