విశాఖపట్టణంలో (Visakhapatnam) రోజు రోజుకో పరిణామాలు కలకలం రేపుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమాలు కొనసాగుతున్నాాయి. ఈ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ (పీపీఎం) విభాగంలో పని చేస్తున్న డీజీఎం (DGM) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ప్లాంట్ కార్యాలయంలోనే అతడు మృతి చెంది ఉన్నాడు. దీంతో ప్లాంట్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు (Police) విచారణ చేపడుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ప్లాంట్ లోని ఈడీ (వర్క్స్) పీపీఎం విభాగంలో టీవీవీ ప్రసాద్ (50) డీజీఎంగా పని చేస్తుండేవారు. యథావిధిగా విధుల్లో భాగంగా సోమవారం జనరల్ షిఫ్ట్ (General Shift)లో విధులకు హాజరయ్యారు. కార్యాలయంలో మూడో అంతస్తులోని తన గదిలోకి వెళ్తూ ఒక్కసారిగా ప్రసాద్ కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే స్టీల్ జనరల్ ఆస్పత్రికి (Steel Plant Hospital) తరలించారు. 1995లో మేనేజ్ మెంట్ ట్రైనీగా ఉద్యోగం ప్రారంభించిన ప్రసాద్ ప్లాంట్ లో డీజీఎం స్థాయికి ఎదిగారు. మంచి పనితనంతో పాటు అందరితో ఆప్యాయంగా ఉన్న ప్రసాద్ హఠాన్మరణం ప్లాంట్ లోని వారిని కలచివేసింది. అయితే అతడు మరణించడానికి కారణం తెలియడం లేదు. అతడి మరణానికి గుండెపోటా? (Heart Attack) లేదా పని ఒత్తిడా? (Stress) అనే అనుమానాలు వస్తున్నాయి. ప్లాంట్ లోని మరో డీజీఎం సహదేవ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.