»Telangana Brs Party High Command Focus On Group Politics In Constituencies
అసమ్మతి స్వరాలు చల్లారాల్సిందే.. 40 నియోజకవర్గాలపై BRS Party ప్రత్యేక దృష్టి
మొదట బుజ్జగింపులు, హామీలతో పార్టీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది. ఇక వినకపోతే వేటు వేసే అవకాశం ఉంది. ఆ లోపు అన్ని సమస్యలు పరిష్కరించుకుని భవిష్యత్ కార్యచరణ కోసం సిద్ధంగా ఉండాలని పార్టీ ఆదేశించింది.
జాతీయ రాజకీయాల్లో పార్టీకి, పార్టీ అధినేతకేసీఆర్ (K Chandrashekar Rao)కు జేజేలు లభిస్తుంటే.. స్వరాష్ట్రంలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయి. అది కూడా ప్రజల్లో కాదు.. సొంత పార్టీలోనే అసంతృప్తులు పెరుగుతున్నాయి. పార్టీలోని విభేదాలు పార్టీని బజారున పడేస్తోంది. పొంగులేటి, జూపల్లి వంటి నాయకులు పార్టీలో చాలా మంది ఉన్నారు. అలాంటి అసంతృప్తులను చల్లార్చకపోతే ఎన్నికల వేళ పార్టీకి తీవ్ర పరాభవం తప్పదు. ఈ విభేదాలు, అసంతృప్తులపై పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వెంటనే పార్టీ అధిష్టానం (High Command) రంగంలోకి దిగింది. లెక్కలు తీయగా దాదాపు 40 నియోజకవర్గాలకు పైగా పార్టీలో అసంతృప్తి స్వరాలు ఉన్నాయని తేలింది.
పార్టీలో చేరికలు, కార్పొరేషన్ పదవులు, కొత్త నాయకత్వం ఎదగడం వంటి వాటితో పలు నియోజకవర్గాల్లో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీనికి తోడు పార్టీలోనే కేటీఆర్ (KT Rama Rao), హరీశ్ రావు (Harish Rao) వర్గమంటూ కొత్త విబేధాలు వచ్చాయి. మంత్రులతో ఎమ్మెల్యేలకు (MLAs) పొసగకపోవడం.. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల విషయంలో అన్యాయం వంటి వాటితో పైస్థాయి మొదలుకుని ద్వితీయ స్థాయి నాయకుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం (Khammam), వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ (MahabubNagar), నల్లగొండ జిల్లాలో ప్రధానంగా ఉంది. జాతీయ స్థాయిలో ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలకు స్థానిక నాయకత్వంలో లోపాలతో పార్టీని వెనక్కి లాగుతోంది.
ఈ విభేదాలను పరిష్కరించే బాధ్యతను ఆయా జిల్లా మంత్రులతో పాటు పార్టీలోని సీనియర్ నాయకులకు బాధ్యత అప్పగించారు. వారితో కూడా ఫలితం రాకుంటే ఇక హరీశ్ రావు, కేటీఆర్
రంగంలోకి దిగనున్నారు. ఆఖరి మాటగా వీరి చెబితే వింటే మంచిది. లేకుంటే పొంగులేటి, జూపల్లి పరిస్థితే వస్తుంది. మొదట బుజ్జగింపులు, హామీలతో పార్టీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది. ఇక వినకపోతే వేటు వేసే అవకాశం ఉంది. పార్టీలో తుది నాయకత్వం కేసీఆర్. బుజ్జగింపుల అనంతరం కూడా మాట వినకపోతే ఇక కఠిన చర్యలు తప్పదు అనేది ఇటీవల జరిగిన పరిణామాలే చెబుతున్నాయి.
ఇక విభేదాలను పార్టీ ఆవిర్భావ దినోత్సవంలోపు (BRS Party Formation Day) ఈ అసంతృప్తి స్వరాలు చల్లారని పార్టీ గడువు విధించింది. ఈనెల 25వ తేదీన పార్టీ ముఖ్య నేతలతో అసెంబ్లీ (Assembly) నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు జరగనున్నాయి. అప్పటి వరకు పార్టీలోని ఉన్న సమస్యలన్ని పరిష్కారం కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసెడింట్ కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 27న ఇక పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం తెలంగాణ భవన్ లో జరుగనుంది. ఆ లోపు అన్ని సమస్యలు పరిష్కరించుకుని భవిష్యత్ కార్యచరణ కోసం సిద్ధంగా ఉండాలని పార్టీ ఆదేశించింది. ఈ సమావేశంలో ఎన్నికలకు శంఖారావం పూరించడంపై పార్టీ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. ఎన్నికలకు సైరన్ మోగించేలా కనిపిస్తోంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ ఎన్నికల కోసం ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు గులాబీ దళం సిద్ధం కానుంది. మున్ముందు గులాబీ పార్టీ కార్యక్రమాలు తీవ్రం కానున్నాయి. ఎన్నికలే లక్ష్యంగా ఇకపై పార్టీ అడుగులు పడనున్నాయి.