ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే నిన్న కేంద్ర హోంత్రి అమిత్ షా బీజేపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గోమతి జిల్లాలోని అమర్పూర్లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించారు. ఐదు అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టిన మాజీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT)తో పొత్తు కూడా ఉంటుందని తెలిపారు. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ మళ్లీ అధికారం చేపట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ 55 మంది అభ్యర్థులను నిలబెట్టింది.
ఫిబ్రవరి 16న త్రిపురలో ఎన్నికల పోలింగ్ జరగనుండగా అన్ని రాజకీయ పార్టీలు పోటీగా ప్రచారం చేస్తున్నాయి. BJP, కాంగ్రెస్, CPI-M (లెఫ్ట్), తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలు బరిలో ఉన్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించి, మ్యానిఫెస్టోను కూడా విడుదల చేశాయి. బీజేపీని గద్దె దించాలని వామపక్షాలు, కాంగ్రెస్‌లు ఏకమయ్యాయి.