తెలంగాణ మంత్రులపై ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రచ్చ రేపుతోంది. తెలంగాణ మంత్రులకు ఏపీ మంత్రులు క్షమాపణలు చెప్పాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలపై చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ నాయకులు క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఇది రాజకీయంగా చర్చనీయాంశం కాగా.. వైఎస్సార్ సీపీ నాయకులు ప్రతి విమర్శలు చేశారు. వారిని తిడితే మీకు ఏమైంది? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించాడు. ఏపీ మంత్రులను తప్పుబట్టడం సరికాదని పేర్కొన్నాడు.
సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియాలో సమావేశంలో పేర్ని నాని మాట్లాడాడు. ‘పవన్ కల్యాణ్ కు కొత్త బాధ ఏంటి? బీఆర్ఎస్ నాయకులను, మంత్రులను విమర్శిస్తే ఆయనకు వచ్చిన కొత్త బాధ ఏంటి? మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు తెలుసుకోకుండా పవన్ ఏపీ మంత్రులను తప్పుబట్టడం సరికాదు. బీఆర్ఎస్ పై, తెలంగాణ మంత్రులపై ఎందుకంత ప్రేమ వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. తెలంగాణ మంత్రులపై పవన్ ఈగ వాలనివ్వడం లేదు. సొంత రాష్ట్రంపై ప్రేమ లేని పవన్ కల్యాణ్ ఏపీ మంత్రులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ఏపీని అవమానిస్తూ మాట్లాడుతుంటే చూస్తూ ఉండాలా? కన్న తల్లిలాంటి రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే ఎందుకు చూస్తూ ఉరుకోవాలి? అని పేర్ని నాని ప్రశ్నించాడు.
‘ఆంధ్రప్రదేశ్ కేవలం నీ రాజకీయాల కోసం అవసరమా? తెలంగాణలో కాపురం, ఆస్తులు, వ్యాపారం తెలంగాణలో జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాజకీయాలకు లొంగిపోయారా? పవన్ కల్యాణ్ కిరాయి మాటలు చేస్తున్నాడు. తెలంగాణ మంత్రుల పట్ల ఆయన వకల్తా పుచ్చుకోవడం ఏమిటి? ఈ కొత్త వకీల్ పాత్ర ఏమిటి’ అని నిలదీశాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలను పేర్ని నాని ప్రదర్శించాడు.