తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నెలలోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం అక్టోబర్ నెలలో రాష్ట్రంలో పర్యటించడానికి రానుంది. అక్టోబర్ 3వ తేదీ నుండి మూడు రోజుల పాటు హైదరాబాద్లో ఈ ఎన్నికల బృందం పర్యటించి పలు విషయాలను సమీక్షించనుంది.
తమ పర్యటనలో భాగంగా మొదటి రోజు జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలతో సమావేశం నిర్వహించి చర్చించనుంది. ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో మరో రోజు చర్చలు జరపనుంది. అలాగే డబ్బు, మద్యం, కానుకల ప్రవాహ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో పూర్తిగా చర్చించనుంది.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాల నోడల్ అధికారులతో సమావేశం కానుంది. వారితో భద్రతాపరమైన ప్రణాళిక, ఏర్పాట్లను సమీక్షించి ఆ తర్వాత రోజు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశం నిర్వహించనుంది. చివరి రోజు రాష్ట్ర సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించనుంది.