తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బాహుబలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. మొన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో మంత్రి కేటీఆర్ మాట్లాడి అందరినీ ఆకర్షించారు. తాజాగా బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఈటల రాజేందర్ ను కలిశారు. చదవండి:బడ్జెట్ లో ఏ శాఖకు ఎంత? కేటాయింపులు ఇలా..
శాసనసభ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో ఈటలను జనార్ధన్ రెడ్డి చూసి పలుకరించారు. వినిపించకోకపోవడంతో ఈటల వెళ్తుంటే దగ్గరికొచ్చి మాట్లాడారు. రాజేందర్ ను ఆలింగనం చేసుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను విష్ చేసే ధైర్యం చేస్తారా’ అని ఈటల ప్రశ్నించారు. ‘రాజకీయాలు వేరు.. మానవ సంబంధాలు వేరు.. విష్ చేసే ధైర్యం ఎందుకు లేదు’ అని మర్రి జనార్ధన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
‘అసలు ఇప్పుడు విలువలు ఎక్కడ ఉన్నాయి? వేడి నూనెలో వేయించి ఎలా ఉంది అని అడిగినట్లు ఉంది’ అంటూ ఈటల ఎద్దేవా చేశారు. అదే సమయంలో మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వచ్చి ఇదే విషయం మాట్లాడారు. వేర్వేరు పార్టీల నేతలు మాట్లాడకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను పనుల కోసం మంత్రి హరీశ్ రావును కలిస్తే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో వస్తోంది’ అని రఘునందన్ రావు తెలిపారు.