Strike in Hollywood: హాలీవుడ్లో సమ్మె.. సినిమాలన్నీ ఆగిపోయాయి!
ప్రతి సినిమా ఇండస్ట్రీలో సమ్మెలు కామన్. ఆ మధ్య టాలీవుడ్లో చేసిన సమ్మె కారణంగా.. సినిమాల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. అయితే టాలీవుడ్ పరిధి తక్కువ కాబట్టి.. నష్టాలు తక్కువనే చెప్పాలి. కానీ ఇప్పుడు హాలీవుడ్ సినిమాలకు భారీ నష్టం తప్పదంటున్నారు. దాదాపు 63 ఏళ్ల తర్వాత హాలీవుడ్లో సమ్మెకు దిగాయి అక్కడి రైటర్స్ గిల్డ్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్.
ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. తమ భవిష్యత్తుకు భరోసా కల్పించాలని, రెమ్యూనరేషన్లు పెంచాలని, ఏఐ నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించాలని డిమాండ్ చేస్తూ.. హాలీవుడ్‌కు చెందిన ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో ఎన్నో సినిమాలు, సిరీస్‌ల విడుదల ఆలస్యం కానున్నాయి. హాలీవుడ్లో మొదటిసారిగా 1960లో నటుడు రోనాల్డ్ రీగన్ నేతృత్వంలో రెండు యూనియన్లు డబుల్ స్ట్రైక్ చేశాయి. ఆ తర్వాత 1980లో స్క్రీన్ యాక్టర్స్ సమ్మె జరిగింది. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత రైటర్స్ గిల్డ్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ కలిసి మరోసారి డబుల్ స్ట్రైక్ చేస్తున్నాయి.
గత 11 వారాలుగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు దిగింది. తాజాగా వారికి నటీనటులు కూడా తోడవంతో హాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మూతపడినట్లయింది. ఇలా రచయితలు, నటులు ఒకేసారి సమ్మెకు దిగడం గత 63 ఏండ్లలో ఇదే తొలిసారి. నిర్మాణ స్టూడియోలతో జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో.. నిరవధిక సమ్మెకు గిల్డ్ పిలుపునిచ్చింది. ఈసారి ఏకంగా 98 శాతం మంది నటీనటులు ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నారు. దాంతో హాలీవుడ్లో అన్నికార్యకలాపాలు ఆగిపోయాయి. గిల్డ్‌లో ఉన్న లక్షా అరవై వేల మంది నటీనటులు సమ్మెబాట పట్టారు.
ఈ సమ్మెతో పలు సినిమాలు, టీవీ కార్యక్రమాలు, సిరీస్ షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్‌లో ట్రామ్ క్రూజ్, ఏంజెలినా జోలీ, జానీ డెప్, మెరిల్ స్ట్రీప్, బెన్ స్టిల్లర్, కోలిన్ ఫారెల్ వంటి స్టార్స్ ఉన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భమని, ఇప్పుడు తాము తమ గళం వినిపించకపోతే కష్టాల్లో పడతామని గిల్డ్ ప్రెసిడెంట్ ‘ఫ్రాన్ డ్రెషర్’ అన్నారు. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే హాలీవుడ్ సినిమాలకు భారీ నష్టం తప్పదని అంటున్నారు.