దేశవ్యాప్తంగా శ్రీరామనవమి (Sri Rama Navami) వేడుకలు తెలంగాణలోని భద్రాచలంలో (Bhadrachalam Sree Seetha Ramachandra Swamy Temple) ప్రసిద్ధి పొందాయి. రెండో అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో (Bhadrachalam) శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరామనవమి పురస్కరించుకుని మిథిలా మైదానంలో (Mithila Ground) సీతారాముల కల్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. కన్నుల పండుగ జరిగిన కల్యాణానికి భక్తులు (Piligrims) భారీ ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allolla Indrakaran Reddy) పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కల్యాణ వేడుకకు పెద్ద ఎత్తున ప్రముఖులు తరలివచ్చారు.
భద్రాచలం సీతారామ ఆలయంలో వారం రోజులుగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవమి సందర్భంగా గురువారం మిథిలా స్టేడియంలో కల్యాణం కమనీయంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అభిజిత్ లగ్నం ముహూర్తంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సీతమ్మ మెడలో రామయ్య మంగళధారణ చేశారు. వేద మంత్రోచ్ఛరణలతో భద్రాద్రి క్షేత్రం ఘోషించింది.
కల్యాణం సందర్భంగా అర్చకులు సీతారాముల గుణగణాలు వివరించారు. అనంతరం భక్త రామదాసు (Bhakta Ramadasu) గొప్పతనం.. సీతారాముల ఆభరణాలు, ఆలయ విశిష్టత తదితర భక్తులకు తెలిపారు. అంతకుముందు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయంలో కొనసాగాయి. ఈ సందర్భంగా భద్రాచాలం రామనామస్మరణ మార్మోగింది. కాగా స్థానిక అధికార యంత్రాంగం భక్తులకు ఎలాంటి లోటుపాట్లు (Facilities) లేకుండా ఏర్పాట్లు చేశారు.
కల్యాణోత్సవంలో స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar), మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత (Malothu Kavitha), హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya), ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, తెలంగాణ ఎమ్మెల్సీ తాతా మధు, త్రిదండి చినజీయర్ స్వామి తదితరులు తరలివచ్చారు. ఉత్సవాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా శుక్రవారం శ్రీరామ పట్టాభిషేకం జరుగనుంది.