గోవాలో కొత్త రూల్స్ ను అమలు చేస్తూ ఆ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రూల్స్ ప్రకారం ఇకపై గోవాలో ఎక్కడబడితే అక్కడ సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉండదు. బహిరంగ ప్రదేశాల్లో, బీచ్ లల్లో మద్యం తాగుతూ పట్టుబడితే అక్కడి సర్కార్ జరిమానా విధించనుంది. అలాగే పబ్లిక్ ప్లేస్ లో ఆహారం వండితే రూ.50 వేల వరకూ ఫైన్ వేయనుంది.
గోవాలో పర్యాటకుల గోప్యత, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక వేళ ఎవరైనా ఆ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. పర్యాటకుల అనుమతి లేకుండా ఎవరైనా ఫోటో తీస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు గోవా టూరిజం డిపార్ట్ మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. అధిక ఛార్జీలను కూడా నివారించేందుకు సర్కార్ చర్యలు చేపట్టనుంది. గోవాలో చాలా మంది పర్యాటకులు రిజిస్టర్ కాని హోటళ్లలో బస చేస్తున్నారని, వాటి వల్ల వివాదాలు కూడా తలెత్తుతున్నాయని తెలిపింది. రెస్టారెంట్లు, హోటళ్లు మొదలైన లైసెన్స్ పొందిన ప్రదేశాల్లో మాత్రమే మద్యం సేవించాలని గోవా సర్కార్ వెల్లడించింది. రూల్స్ ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.