»Revanth Reddy Dares Kt Rama Rao For Probe Into Charges Of Blackmail
Revanth Reddy: బ్లాక్‌మెయిల్‌పై కేటీఆర్‌కు సవాల్
కేటీఆర్ (KTR) అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) పేరు ఎత్తకుండా సంచలన ఆరోపణలు చేశారు. బ్లాక్ మెయిలర్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ తెలంగాణ అధినేత ధీటుగా స్పందించారు. పరస్పర ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌లు భూముల కోసమే పార్టీని మారారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Congress) అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్ర గురువారం మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) బ్లాక్ మెయిలర్ అనడంపై ఘాటుగా స్పందించారు. అధికార పార్టీ నేతలే భూములను అక్రమంగా లాక్కుంటున్నారన్నారు. మియాపూర్‌లోని సర్వే నెంబర్ 80లో ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే భూములను బదలాయించుకునేందుకు ఎమ్మెల్యే, ఎంపీలు పార్టీ ఫిరాయించారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర రావుకు మియాపూర్‌లో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆదిత్య కన్స్ట్రక్షన్ పేరిట బదలాయించిందని, ఇందులో నిజం లేదా చెప్పాలని నిలదీశారు. తెల్లాపూర్ భూకేటాయింపుల పైన విచారణకు సిద్ధమా అని రేవంత్ సవాల్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలతో పాటు అధికార పార్టీ తనపై చేస్తున్న విమర్శల పైన కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల్లో నిజాం కాలం నుండి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను కేటీఆర్ (KTR), ఆయన బృందం ధరణి పోర్టల్‌ను (dharani) అడ్డు పెట్టుకొని కొల్లగొట్టిందని ఆరోపించారు. 2004 నుండి 2014 వరకు 22ఏ కింద ఉన్న నిషేధిత భూములను కూడా జాబితా నుండి తొలగించి బదలీ చేయించుకునేందన్నారు. వీటిపై విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు.
కేటీఆర్ (KTR) అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) పేరు ఎత్తకుండా సంచలన ఆరోపణలు చేశారు.
‘కాంగ్రెస్‌కు ఒక అధ్యక్షుడిని పెట్టుకుంది. ఆయన పేరు నేను చెప్పను కానీ, ప్రగతి భవన్‌ను బాంబులతో బద్దలు కొడతాం. బయట బ్లాక్ మెయిల్ చేస్తాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్‌ను రూట్ టు ఇన్కమ్గా మార్చుకుంటాం. ఆర్టీఐ పేరిట బయట అడ్డగోలుగా దందాలు చేస్తాం అంటాడు. రంగారెడ్డి జిల్లా భూములు, హైదరాబాద్ భూములపై మీ పార్టీ (Congress) అధ్యక్షుడి దగ్గర ఒక సపరేటు దఫ్తర్ నడుస్తుంది. ఆ దఫ్తర్లో రిటైర్డ్ తహసీల్దార్లతో సహా కొంతమందిని కూర్చోబెట్టుకొని ప్రభుత్వాన్ని, ప్రైవేట్ వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇలా కోట్లాది రూపాయలు వసూలు చేసేవాళ్లకు ధరణి వల్ల ఇబ్బంది ఉంటుంది’ అంటూ సభలో అన్నారు. దీనిపైనే రేవంత్ ధీటుగా సమాధానం ఇచ్చారు.
తన యాత్రలో రేవంత్ ఇంకా మాట్లాడుతూ… తెలంగాణలో (Telangana) అందరి సమస్య తీరాలంటే, ప్రజలకు మేలు జరగాలంటే బీఆర్ఎస్ (BRS) పోయి, కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్‌ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా పేరు పెడతామన్నారు. ధరణి పోర్టల్‌ను ఎత్తివేస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, కౌలు రైతులకు రూ.15వేలు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి రూ.5 లక్షలు ఇస్తామన్నారు. మరోవైపు, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేల పైన దర్యాఫ్తు జరపాలని కోరుతూ గురువారం లేఖ ద్వారా డీజీపీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ అధినేత.