అసలు గవర్నర్, ప్రభుత్వం మధ్య విబేధాలకు కౌశిక్ రెడ్డినే కారణం. కౌశిక్ రెడ్డితోనే గవర్నర్, ప్రభుత్వం మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. కౌశిక్ రెడ్డిని సామాజిక సేవ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని సీఎం కేసీఆర్ గవర్నర్ కు కోరారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ కు అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్ తమిళిసైకు పంపించారు. ప్రభుత్వ తీర్మానాన్ని గవర్నర్ కొన్నాళ్లు అంటిపెట్టుకున్నారు. ఎంతకీ స్పందించకపోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు.
గవర్నర్ వ్యవహారంపై తెలంగాణ ఎమ్మెల్సీ (Telangana MLC) పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రథమ పౌరురాలైన గవర్నర్ పై అసభ్యంగా మాట్లాడడం సంచలనం రేపింది. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదాలు కొనసాగుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women- NCW) స్పందించింది. ఎమ్మెల్సీ వ్యాఖ్యలను కమిషన్ సుమోటో (Suo moto Notice)గా తీసుకుంది. దీంతో విచారణకు హాజరు కావాలని కౌశిక్ రెడ్డికి కమిషన్ నోటీసులు జారీ చేసింది.
తెలంగాణలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొన్నాళ్లు తీవ్ర స్థాయిలో విబేధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజకీయ నాయకుల మాదిరి రెండు రాజ్యాంగ సంస్థల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ సమావేశాల నిర్వహణ సమయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయకపోవడంతో మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర విమర్శలు చేశారు. ఈ సమయంలో కౌశిక్ రెడ్డి కూడా గవర్నర్ పై విమర్శలు చేశాడు. అయితే ఒకడుగు ముందుకు వేసి గవర్నర్ పై అసభ్యంగా మాట్లాడాడు. ‘అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లుల ఫైళ్లను గవర్నర్ తన వద్ద పెట్టుకున్నారు. ఒక్క ఫైల్ ను కూడా కదలనివ్వడం లేదు’ అంటూనే గవర్నర్ ను వ్యక్తిగతంగా దూషిస్తూ విమర్శలు చేశాడు.
కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ (BJP) తీవ్రంగా తప్పుబట్టింది. మహిళా గవర్నర్ పై కనీస గౌరవం లేకుండా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అసభ్యంగా మాట్లాడడం తగదని మండిపడ్డారు. కౌశిక్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు కొందరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. గవర్నర్ పదవికి గౌరవం ఇవ్వకుండా.. కనీసం మహిళా అని కూడా చూడకుండా కౌశిక్ రౌడీలా విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. తాజాగా ఈ వ్యాఖ్యలను జాతీయ మహిళ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న మహిళను గౌరవించకుండా ఎమ్మెల్సీ అసభ్య పదజాలం వినియోగించడాన్ని కమిషన్ తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. విచారణకు హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 21వ తేదీన ఉదయం 11.30 గంటలకు కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. అయితే ఈ నోటీసులపై కౌశిక్ రెడ్డి ఇప్పటివరకు స్పందించలేదు. విచారణకు హాజరవుతాడా లేదా అనేది ఇంకా తెలియలేదు.
గవర్నర్, కౌశిక్ మధ్య ఆది నుంచి వివాదం అసలు గవర్నర్, ప్రభుత్వం మధ్య విబేధాలకు కౌశిక్ రెడ్డినే కారణం. కౌశిక్ రెడ్డితోనే గవర్నర్, ప్రభుత్వం మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. కౌశిక్ రెడ్డిని సామాజిక సేవ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని సీఎం కేసీఆర్ గవర్నర్ కు కోరారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ కు అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్ తమిళిసైకు పంపించారు. ప్రభుత్వ తీర్మానాన్ని గవర్నర్ కొన్నాళ్లు అంటిపెట్టుకున్నారు. ఎంతకీ స్పందించకపోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు. కౌశిక్ ఎమ్మెల్సీగా నియమించలేనని గవర్నర్ కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం సిఫారసు బుట్ట దాఖలు చేశారు. అప్పటి నుంచి గవర్నర్, ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు పెరిగాయి. ఈ సమయంలో తన పదవికి అడ్డు తగిలిన గవర్నర్ పై కౌశిక్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఈక్రమంలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు.