»Nellore Engineering Student Commits To Suicide Over Ragging In College
Raggingకు ఏపీలో విద్యార్థి బలి.. అమ్మాయిల నంబర్లు, బిర్యానీ తేవాలని వేధింపులు
ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. సీఎం జగన్ పాలనలో విద్యార్థులకు రక్షణ లేదని ఆరోపించారు. ర్యాగింగ్ ను అరికట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. జగన్ పాలనలో గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని తెలిపారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కళాశాలలో ఆగడాలు పెరిగిపోతున్నాయని.. వెంటనే కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ర్యాగింగ్ (Ragging) భూతం వెలుగులోకి వచ్చింది. వేధింపులను తట్టుకోలేక ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సీనియర్ల వేధింపులకు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థి (Engineer Student) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (Nellore District)లో చోటుచేసుకుంది. ఇంజనీర్ అవుతాడనుకుంటే కళాశాలలో సీనియర్ల ఆగడాలకు తమ కుమారుడు బలయ్యాడని విద్యార్థి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. తన కొడుకుకు న్యాయం జరగాలని డిమాండ్ చేసింది. కాగా ర్యాగింగ్ తో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. జగన్ మోహన్ రెడ్డి పాలనలో విద్యార్థులకు రక్షణ లేదని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పెంచలయ్య, లక్ష్మీకుమారిల కుమారుడు ప్రదీప్. కావలి (Kavali) లోని ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల (RSR Engineering College)లో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతుండేవాడు. మహాశివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా సెలవులు ఉండడంతో ప్రదీప్ కావలిలోని కళుగోళమ్మపేటలో నివసిస్తున్న చిన్నమ్మ ఇంటికి వచ్చాడు. శనివారం సాయంత్రం వాకింగ్ కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత రైలు పట్టాలపైకి చేరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు వెళ్తుండగా పట్టాలు దాటుతూ తన ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. ఈ సంఘటనతో తల్లి లక్ష్మీకుమారి కన్నీరుమున్నీరైంది. ఈ సందర్భంగా కళాశాలలో వేధింపులతోనే తన కుమారుడు బలయ్యాడని మృతుడి తల్లి లక్ష్మీకుమారి సంచలన ఆరోపణలు చేసింది.
ప్రదీప్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. కడనూతలలోని ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (Ramireddy Pratap Kumar Reddy) ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. కళాశాలలో సీనియర్ విద్యార్థులు వేధింపులకు పాల్పడుతున్నారు. మీ క్లాస్ లోని అమ్మాయిల ఫోన్ నంబర్లు ఇవ్వాలని ప్రదీప్ పై ఒత్తిడి తెచ్చేవారు. బీర్లు, బిర్యానీ కావాలని డిమాండ్ చేసేవారు. తన వద్ద డబ్బులు లేవంటే ఫోన్ ఇవ్వాలని దౌర్జన్యం చేసేవారు’ అని ఆరోపించారు. వేధింపులకు పాల్పడుతుంటే తాము వచ్చి మాట్లాడుతామంటే ప్రదీప్ వద్దని వారించేవాడని గుర్తు చేసుకున్నారు. ‘టీసీ ఇచ్చేయండి.. వేరే చోటకు వెళ్లి చదువుకుంటానని యాజమాన్యాన్ని మా కుమారుడు అడిగినా పట్టించుకోలేదు. ర్యాగింగ్ విషయమై తాము ఫిర్యాదు చేసిన తర్వాత వేధింపులు మరింత పెరిగాయి. వేధింపులకు పాల్పడుతున్న విద్యార్థుల పేర్లు ఇవ్వమంటే ఇవ్వలేదు. వేధింపులు తట్టుకోలేక హాస్టల్ నుంచి బయటకు వస్తే చంపేస్తామని హెచ్చరించినట్లు కూడా ప్రదీప్ చెప్పాడు. ఈ భయంతో ప్రదీప్ ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదు’ అని తల్లి లక్ష్మీకుమారి వాపోయింది.
విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై (Railway Police) అరుణ కుమారి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం కాదు ఆత్మహత్యకు పాల్పడడంతో ఈ కేసును బిట్రగుంట స్టేషన్ కు బదిలీ చేస్తామని ఎస్సై తెలిపారు. అయితే ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. సీఎం జగన్ పాలనలో విద్యార్థులకు రక్షణ లేదని ఆరోపించారు. ర్యాగింగ్ ను అరికట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. జగన్ పాలనలో గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని తెలిపారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కళాశాలలో ఆగడాలు పెరిగిపోతున్నాయని.. వెంటనే కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా ర్యాగింగ్ తో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. మానవ హక్కుల సంఘం సుమోటోగా ఈ కేసును తీసుకోవాలని కోరుతున్నాయి.