»Mla Vs Mp Guvvala Balaraju Insulted Nagarkurnool Mp Ramulu
NagarKurnool ఎమ్మెల్యే Vs ఎంపీ.. ఫ్లెక్సీలపై రగడ.. ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్
ఎంపీతో తేల్చుకుందామంటూ సవాల్ విసిరాడు. నా అడ్డాలో మీ పెత్తనమేంది అంటూ ఫోన్ (Phone Call)లో బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ సీనియర్ నాయకుడు ‘నీ బెదిరింపులకు నేను భయపడను’ అంటూ బాలరాజుకు బదులిచ్చాడు. వీరి మధ్య సాగిన సంభాషణ బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది.
బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) వ్యవహారం దుమారం రేపుతున్నది. రాజకీయాల్లో పెద్దా చిన్నా లేకుండా తీవ్ర స్థాయిలో రెచ్చిపోతున్నాడు. ఇటీవల కళాకారులు, క్రీడాకారులకు భూమి పత్రాల పంపిణీ సమయంలో బాలరాజు ప్రవర్తన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. సీనియర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలోనే అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. మంత్రిపై అరుస్తూ రుసరుసలాడుతూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తాజాగా సీనియర్ నాయకుడు, నాగర్ కర్నూల్ లోక్ సభ సభ్యుడు పోతుగంటి రాములు (Pothuganti Ramulu)పై ఎమ్మెల్యే బాలరాజు దుర్భాషలాడాడు. ఎంపీతో తేల్చుకుందామంటూ సవాల్ విసిరాడు. నా అడ్డాలో మీ పెత్తనమేంది అంటూ ఫోన్ (Phone Call)లో బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ సీనియర్ నాయకుడు ‘నీ బెదిరింపులకు నేను భయపడను’ అంటూ బాలరాజుకు బదులిచ్చాడు. వీరి మధ్య సాగిన సంభాషణ బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (Combined Mahabub Nagar District)లో బాలరాజు తీరు వివాదాలకు కేంద్రంగా మారింది. వీరి మధ్య సాగిన సంభాషణ కాల్ రికార్డ్ వైరల్ (Viral)గా మారింది. తన నియోజకవర్గం అచ్చంపేటలో ఎమ్మెల్యే కుమారుడు భరత్ ప్రసాద్ (Bharath Prasad) ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదానికి కారణమైంది. రాములు, బాలరాజు మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.
ఎమ్మెల్యే: నియోజకవర్గంలో నీ కొడుకు ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదు. ఎంపీ: ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటది బాలరాజు ఎమ్మెల్యే: పార్టీలో ఉండదు అట్ల ఎంపీ: అయితే పార్టీలో తేల్చుకుందాం ఎమ్మెల్యే: నాకు ఉన్న అధికారాన్ని నేను ఉపయోగిస్తా ఎంపీ: నేను జిల్లా అధ్యక్షుడిగా పని చేశా. నాకు తెలుసు. నీకు ఇచ్చే గౌరవం నీకు ఇస్తా. నాకిచ్చే గౌరవం నాకు ఉంటది. చేసేది చేసి అంతా అయిపోయింది అంటే ఎట్లా? ఎమ్మెల్యే: అందులో సంబంధం ఉందంటే భవిష్యత్ లో కూడా చేస్తా ఎంపీ: చేసుకోవయ్యా.. నేనొద్దన్నానా? ఎమ్మెల్యే: వయా గియా అని మాట్లాడకు. మంచిగా మాట్లాడు. సర్ అని పిలుస్తుంటే వయా అంటవ్. అటెండర్ మాట్లాడినట్లు మాట్లాడతవ్ ఎంపీ: వయా అంటే ఏంది అర్థం? అయ్యా బాలరాజు గారు మీరు చేసేది చేసుకోండి. దాని గురించి ఎందుకంత కోపం. ఎమ్మెల్యే: ఇక నుంచి నీ కొడుకు పార్టీ ఫ్లెక్సీలు కట్టడానికి వీలులేదు. ఈ రోజు, రేపు తీసేయండి. ఎంపీ: అంటే.. అంటే నీ బెదిరింపులు నాకాడ పనికి రావు ఎమ్మెల్యే: రికార్డు చేసుకో. ఎవరికైనా చెప్పుకో. అట్ల చేస్తే నీ కొడుక్కి పార్టీ పరంగా మర్యాదు ఉండదు. ఎంపీ: నా కొడుకు నాకు సహకారంగా ఉంటడు. ఎవరి కొడుకు వారు సహకారంగా ఉంటడు. మరి నీ కుటుంసభ్యుల ఫ్లెక్సీలు ఎందుకు కట్టారు? ఎమ్మెల్యే: మా అభిమానులు కట్టారు ఎంపీ: మాకు అభిమానులే కట్టారు ఎమ్మెల్యే: ఇలా చేస్తే మంచిగుండదు ఎంపీ: నీ బెదిరింపులు నా వద్ద చెల్లవు. ఈ విషయం అధిష్టానం వద్దే చూసుకుందాం.
ఇలా వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ ఆడియో వైరల్ గా మారింది. ఈ వ్యవహారంపై స్పందించిన ఎంపీ రాములు పార్టీ అధిష్టానం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తా అని చెప్పారు. కాగా బాలరాజు స్పందించేందుకు నిరాకరించారు. ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్త జెడ్పీటీసీ సభ్యుడు భరత్ ప్రసాద్. ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి కోసం భరత్ పోటీ చేయగా నిరాశే ఎదురైంది. దీంతో తన తండ్రి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చంపేటలో ఈసారి ఎమ్మెల్యే టికెట్ కోసం భరత్ ప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీలో విబేధాలు మొదలయ్యాయి. నాగర్ కర్నూల్ జెడ్పీ చైర్మన్ ఎన్నిక నుంచి ఎమ్మెల్యే, ఎంపీ మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఈ ఫ్లెక్సీల అంశం అందులో భాగమే. నాగర్ కర్నూల్ జిల్లాలో మొదలైన ఈ విబేధాలను పార్టీ అధిష్టానం పరిష్కరించాల్సి ఉంది. కాగా గువ్వల బాలరాజు ప్రభుత్వ విప్ గా కొనసాగుతూనే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. అందుకే ఎంపీ అయినా కూడా తీవ్ర స్థాయిలో బాలరాజు మాట్లాడాడు. ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.