మెక్సికోలోని ఓక్సాకాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఘటనలో 27 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో 17 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఓక్సాకా స్టేట్ ప్రాసిక్యూటర్ బెర్నార్డో రోడ్రిగ్జ్ అలమిల్లా తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
సివిల్ ప్రోటెక్షన్ ఏజెన్సీ ప్రకారంగా ఈ ఘటనలో గాయపడ్డ ఆరుగురు అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి మెక్సికో సిటీ నుంచి శాంటియాగో డి యోసోండువా పట్టణానికి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. నియంత్రణ కోల్పోయిన బస్సు మాగ్డలీనా పెనాస్కో పట్టణంలో వద్ద 80 అడుగుల లోతులోకి పడిపోయిందని అధికారులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంపై ఓక్సాకా గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.